శ్రీశైలంలో వరలక్ష్మి వ్రతాలు.. 1,800 మందికి పైగా భక్తులు!

కలం, వెబ్ డెస్క్: శ్రావణ మాసంలోని పవిత్ర వరలక్ష్మీ వ్రత సందర్భంగా శ్రీశైల దేవస్థానం (Srisailam) ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని చంద్రవతి కల్యాణమండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 1,800 మందికి పైగా ముత్తైదువలు హాజరై వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. అయితే వ్రతం ఆచరించే మహిళలకు అవసరమైన పూజా సామగ్రిని దేవస్థానమే ఉచితంగా సమకూర్చింది. ప్రతి భక్తునికి ప్రత్యేకంగా కలశాలను ఏర్పాటు చేసి వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.

తొలుత వ్రతం నిర్విఘ్నంగా సాగేందుకు ముందుగా మహాగణపతి పూజను అర్చకులు నిర్వహించారు. అనంతరం వేదికపై కొలువుదీరిన భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఉత్సవమూర్తులకు షోడశోపచార పూజలు నిర్వహించారు. భక్తులచే కలశస్థాపన చేయించి, వరలక్ష్మీదేవిని మంత్రోచ్చారణతో ఆవాహన చేశారు. శ్రీ సూక్తం పఠించి అమ్మవారికి షోడశోపచార పూజలు చేశారు. వరలక్ష్మీ వ్రతకథను పఠిస్తూ వ్రత మహిమను పండితులు భక్తులకు వివరించారు. నైవేద్యం అనంతరం మంగళహారతి, నీరాజన మంత్రపుష్పాలతో వ్రతాన్ని సంపూర్ణం చేశారు.

అమ్మవారి వ్రతంలో పాల్గొన్న ప్రతి భక్తుడికి శ్రీశైల దేవస్థానం తరఫున ప్రత్యేక ప్రసాదాలను అందజేశారు. చీర, రవిక వస్త్రం, పూలు, గాజులు, కంకణాలతో పాటు వృక్షప్రసాదంగా తులసి మొక్కను భక్తులకు అందించారు. వ్రత కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించేలా చంద్రవతి కల్యాణమండపంలో ప్రత్యేకంగా ఎల్‌ఈడీ స్క్రీన్ లను అమర్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>