కలం, తెలంగాణ బ్యూరో: ఖైరతాబాద్ కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం మొదలైంది. మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ నేత పి. విజయారెడ్డి వర్గాల మధ్య చాలాకాలంగా రగులుతున్న విభేదాలు.. ఉపఎన్నిక (Khairatabad By-Election) నేపథ్యంలో మరోసారి భగ్గుమంటున్నాయి. అభ్యర్థిత్వం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠకు తోడు.. ప్రత్యర్థి వర్గాన్ని ఎలా కలుపుకుపోవాలన్నది కాంగ్రెస్ అధిష్ఠానానికి సవాల్ గా మారింది. గతంలోనే బహిర్గతమైన విభేదాలు ఇప్పుడు ఎన్నికల వేళ మరింత కీలకంగా మారడంతో.. ఖైరతాబాద్ కాంగ్రెస్ లో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
టికెట్ చిక్కుముడి వీడేదెట్లా?
2025లో జరిగిన నియోజకవర్గ సమావేశంలోనే దానం, విజయారెడ్డి వర్గాల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇప్పుడు దానం నాగేందర్ అనర్హతతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ కావడంతో ఆ పాత విభేదాలే ఉపఎన్నిక రూపంలో మళ్లీ తెరపైకి వచ్చాయి. ఉపఎన్నికలో పోటీకి దానం నాగేందర్ ఇప్పటికే ఆసక్తి వ్యక్తం చేయగా.. విజయారెడ్డి పేరు కూడా పార్టీ పరిశీలనలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో టికెట్ ఎవరికి అన్నది పార్టీకి మరో చిక్కుగా మారింది.
దానంకు వరుస చిక్కులు..
2023 ఎన్నికల పేచీ కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ ఎన్నికల్లో దానం నాగేందర్ పై పోటీ చేసిన విజయారెడ్డి.. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉండగానే.. తుది తీర్పు వెలువడే వరకు ఖైరతాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయకుండా ఆదేశించాలని కోరుతూ ఆమె తాజాగా మరో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ఎన్నికల సంఘం కూడా పిటిషన్ పరిష్కారం అయ్యే వరకు ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయబోమని కోర్టుకు తెలిపింది. దీంతో దానం నాగేందర్ కు వరుస చిక్కులు ఎదురవుతున్నాయన్న చర్చ నియోజకవర్గంలో సాగుతున్నది. ఈ క్రమంలోనే ఆయన తరచూ అసహనానికి గురవుతున్నారన్న చర్చ కూడా జరుగుతున్నది. ఉపఎన్నికపై స్పష్టత రావాల్సిన సమయంలో ఎన్నికల సంఘంపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
క్రాస్ ఓటింగ్ చాన్స్..
కాంగ్రెస్ కు అసలు పరీక్ష అభ్యర్థి ఎంపిక తర్వాతే అన్న చర్చ పార్టీ వర్గాల్లో ఉంది. దానం, విజయారెడ్డి వర్గాల మధ్య సయోధ్య కుదరకుండానే ఎన్నికల బరిలోకి దిగితే.. అంతర్గత అసమ్మతి, వర్గపోరు, క్రాస్ ఓటింగ్, సొంత పార్టీ నుంచే వ్యతిరేక ప్రచారం వంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థి ఎవరైనా.. ప్రత్యర్థి వర్గాన్ని ఎంతవరకు కలుపుకుపోతారన్నదే కీలకంగా మారనుంది.
ఇప్పటికే ఉపఎన్నిక నోటిఫికేషన్ విషయంలో కోర్టు వ్యవహారం కొనసాగుతుండటంతో.. కాంగ్రెస్ నాయకత్వానికి రెండు అంశాలు ఏకకాలంలో సవాల్‌గా మారాయి. ఒకటి.. అభ్యర్థి ఎంపిక. రెండోది.. దానం, విజయారెడ్డి వర్గాల మధ్య సమన్వయం. ఈ రెండింటిలో ఏదీ తేడా కొట్టినా.. ఖైరతాబాద్ కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయం ఎన్నికల వేళ మరింత ముదిరే అవకాశం ఉన్నది.

