కోహ్లీ గొప్పా.. సచిన్ గొప్పా?.. డివిలియర్స్‌కి గణేష్ కౌంటర్!

కలం, స్పోర్ట్స్: కోహ్లీ గొప్పా.. సచిన్ గొప్పా? (Sachin vs Kohli) ఈ చర్చకు ఏబీ డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు కొత్త మలుపు తీసుకున్నాయి. సచిన్ కంటే విదేశీ టెస్టుల్లో విరాట్ కోహ్లీ మెరుగైన బ్యాటర్ అని డివిలియర్స్ అభిప్రాయపడ్డారు. సీమ్, బౌన్స్‌కు అనుకూలమైన పిచ్‌లపై కోహ్లీ సచిన్ కంటే బలమైన బ్యాటర్ అని ఆయన పేర్కొన్నారు. సచిన్ విదేశాల్లో భారత బ్యాటర్లకు మార్గం చూపారని చెప్పారు. అయితే కోహ్లీ ఆ స్థాయిని మరింత పెంచారని అభిప్రాయపడ్డారు.

ఈ వ్యాఖ్యలపై మాజీ భారత ఫాస్ట్ బౌలర్ దొడ్డ గణేష్ స్పందించారు. డివిలియర్స్ అభిప్రాయాన్ని అంగీకరించని ఆయన.. ఎక్స్‌లో వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. విదేశీ టెస్టుల్లో సచిన్ గణాంకాలు కూడా ఈ చర్చకు కారణమయ్యాయి. సచిన్ 106 విదేశీ టెస్టుల్లో 8,705 పరుగులు చేశారు. ఆయన సగటు 54.7గా ఉంది. ఇందులో 29 సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ 68 విదేశీ టెస్టుల్లో 4,894 పరుగులు చేశారు. ఆయన సగటు 41.51గా ఉంది.

అయితే కోహ్లీకి కూడా టెస్టుల్లో ప్రత్యేక ఘనతలు ఉన్నాయి. 2014-15 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాలుగు సెంచరీలు చేశారు. ఆస్ట్రేలియాలో భారత్‌కు తొలి టెస్ట్ సిరీస్ విజయాన్ని అందించిన కెప్టెన్‌గా నిలిచారు. 2016లో 1,215 పరుగులు, 2018లో 1,322 పరుగులు చేశారు. 2018లో ఇంగ్లండ్‌లో 697 పరుగులు సాధించారు. సచిన్ చివరి దశలోనూ అద్భుతంగా రాణించారు. 2010లో 14 టెస్టుల్లో 1,500కు పైగా పరుగులు చేశారు. ఏడు సెంచరీలు సాధించారు.

2011లో దక్షిణాఫ్రికాపై మూడు టెస్టుల్లో 326 పరుగులు చేశారు. అదే సమయంలో తన 50వ, 51వ టెస్ట్ సెంచరీలను పూర్తి చేశారు. టెస్టు క్రికెట్‌లో సచిన్, కోహ్లీ పోలికపై డివిలియర్స్ వ్యాఖ్యలు మాత్రం చర్చకు దారితీశాయి. ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు కొనసాగుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>