కలం, వెబ్ డెస్క్: చక్కెర ధరలు (Sugar Prices) పెరిగిన నేపథ్యంలో నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. దేశీయ మార్కెట్లోకి 10 లక్షల టన్నుల చక్కెరను దిగుమతి చేసేందుకు అనుమతులు జారీ చేసింది. ప్రస్తుతం ఉత్పత్తి డిమాండ్ కంటే తక్కువగానే ఉన్నప్పటికీ, అక్టోబర్లో కొత్త క్రషింగ్ సీజన్ ప్రారంభయ్యే నాటికి దేశీయ అవసరాలు తీర్చేంత నిల్వలు అందుబాటులో ఉంటాయని కేంద్ర వినియోగదారుల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
జులై నెలలో కిలో చక్కెర రూ.48 ఉండగా.. ఆగస్ట్ 20వ తేదీన రూ.55.70కి పెరిగింది. చక్కెర ధరలు పెరగడమనేది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోందని.. సరఫరా తగ్గడమే అందుకు కారణమని మంత్రిత్వ శాఖ విశ్లేషించింది. ప్రతి వ్యాపారికి 400 టన్నుల స్టాక్ లిమిట్ విధించినట్లు తెలిపింది. ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇథనాల్ కారణం కాదు..
ఇథనాల్ కారణంగానే చక్కెర ధరలు పెరుగుతున్నట్లు వస్తున్న ఆరోపణలను కేంద్ర వినియోగదారుల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఖండించింది. అంచనా కంటే చక్కెర ఉత్పత్తి తగ్గిపోవడం, వరుస పండుగల నేపథ్యంలో పెరిగిన గిరాకీ, వాతావరణ పరిస్థితుల కారణంగా చక్కెర ఉత్పత్తి తగ్గడం, కొంత మేర బ్లాక్ మార్కెటింగ్ చేయడం వంటి అంశాల కారణంగానే ధరలు పెరుగుతున్నట్లు వివరించింది. దేశ వ్యాప్తంగా చక్కెర నిల్వలపై నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని.. వినియోగదారులకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు.

