కలం, వెబ్ డెస్క్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేయాలని.. జీఓ 7ను రద్దు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ పేద, మధ్యతరగతి విద్యార్థులను చదువులకు దూరం చేసే జీఓను తక్షణమే రద్దు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ, బీసీ జేఏసీ వర్కింగ్ అధ్యక్షులు గుజ్జ కృష్ణ, విద్యార్థి నాయకులతో కలిసి విద్యార్థులను విద్యకు దూరం చేసే జీఓను వెనక్కి తీసుకోవాలని నిరసన తెలిపారు. జీఓ నంబర్ 7 కారణంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే జీఓ నంబర్ 7ను ఉపసంహరించుకొని కోరారు.

