TG: రేపే శ్రీరామనవమి.. ముస్తాబవుతోన్న దేవాలయాలు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు (Sri Ram Navami) శుక్రవారం ఘనంగా జరుగనున్నాయి. శ్రీ సీతారాముల కల్యాణానికి గ్రామాల్లోని చిన్న దేవాలయాల నుంచి ప్రసిద్ధ దేవాలయాలు ముస్తాబవుతోన్నాయి. భద్రాచలం నుంచి అయోధ్య వరకు సీతారాముల కల్యాణ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం భద్రాచలంలో వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ గోపురాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. ఏటా స్వామివారి కళ్యాణం జరిగే మిథిలా స్టేడియాన్ని అంగరంగ వైభవంగా అలంకరించారు. వేలాది మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. స్వామివారికి రాష్ట్ర దేవాదాయ తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి శ్రీ సీతారాముల కల్యాణానికి భారీగా భక్తులు రానుండటంతో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా సుమారు 2,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇక రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం, కొండగట్టు, స్వర్ణగిరి, కాళేశ్వరం, కురుమూర్తి వెంకటేశ్వరస్వామి, అలంపూర్ జోగులాంబ, మన్యంకొండ వేంకటేశ్వరస్వామి దేవాలయం, అనంతగిరి క్షేత్రం, స్తంభద్రి లక్ష్మీ నరసింహ ఆలయం, వాడపల్లి శ్రీ మీనాక్షీ అగస్తేశ్వరస్వామి మందిరం, లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, చిల్కూరు – బాలాజీ మందిరం, కర్మన్‌ఘాట్ – శ్రీధ్యానాంజనేయస్వామి ఆలయం, అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయం, కోహెడ సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం, కీసరగుట్ట శివాలయం, హనుమకొండ శ్రీ రుద్రేశ్వర స్వామి వారి దేవాలయం, వరంగల్ భద్రకాళీ దేవాలయం, కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం, కురవి వీరభధ్ర దేవాలయం, పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం, ఇల్లందకుంట రామాలయం, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, జైనథ్ శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయం, కుంటాల సోమేశ్వర ఆలయం, బాసర జ్ఞాన సరస్వతీ ఆలయాలతో పాటు అన్ని గ్రామాల్లో శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి.

శ్రీ రామ నవమి సందర్భంగా హైదరాబాద్‌ లోని అన్ని దేవాలయాల్లో శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. సీతారాంబాగ్ దేవాలయం నుంచి కోఠిలోని హనుమాన్‌ వ్యాయామశాల వరకు శోభాయాత్ర జరగనుంది. ఈ మార్గంలో వాహనాలకు అనుమతి ఉండదు. సీతారాంబాగ్, బోయిగూడ కమాన్ నుంచి మల్లేపల్లి ఎక్స్ రోడ్స్ వైపు ట్రాఫిక్ డైవర్ట్‌ చేయనున్నారు. మంగళ్‌హాట్, గాంధీ విగ్రహం, పురానాపూల్, జుమేరాత్ బజార్ నుంచి వచ్చే వాహనాలను టక్కర్‌వాడీ జంక్షన్ వైపు మళ్లించనున్నారు. అబిడ్స్‌ జీపీఓ, సుల్తాన్‌ బజార్‌, కోఠి, అబిడ్స్‌ ప్రధాన రోడ్ల వద్ద ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నారు. ఎంజే బ్రిడ్జ్‌, బేగంబజార్‌, అఫ్జల్‌గంజ్‌, సిటీ కాలేజీ వైపు వెళ్లే వాహనాలను జుమేరాత్‌ బజార్‌ మీదుగా మళ్లించనున్నారు. బేగంబజార్‌, అఫ్జల్‌గంజ్‌, ఎంజే మార్కెట్‌, కోఠి, కాచిగూడ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్‌ రద్దీగా ఉండనుంది. ఈ నేపథ్యంలో ఏవిధంగా దారి మళ్లించాలనే దానిపై పోలీసులు చర్యలు తీసుకోనున్నారు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>