కరీంనగర్‌లో ఘనంగా శ్రీ మహాశక్తి దేవాలయ షోడశ వార్షికోత్సవం

కలం, కరీంనగర్ బ్యూరో: జిల్లా ప్రజల ఆరాధ్య దైవాలు, మహిమాన్విత శక్తి స్వరూపులైన శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు కొలువుదీరిన దివ్య క్షేత్రం “శ్రీ మహాశక్తి దేవాలయం (Sri Mahashakti Temple)”. అఖండ భక్తి పారవశ్యంతో, ఆధ్యాత్మిక శోభతో ఈ దేవాలయ షోడశ (16వ) వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామి వారి దివ్య పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

వైభవంగా పూజా కార్యక్రమాలు, అభిషేకాలు జరిగాయి. ఉదయం 4:30 గంటలకు జగద్గురువుల కరకమలాల ద్వారా శ్రీ లక్ష్మీ గణపతి స్వామి, శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు, అనంతనాగేంద్ర స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఉదయం 8:00 గంటలకు స్వస్తిపుణ్యాహవాచనం, గణపతి పూజ, అఖండ దీపారాధన, సర్వతోభద్ర మండల పూజలను భక్తిశ్రద్ధలతో జరిపారు. లోక కళ్యాణార్థం లక్ష్మీగణపతి హోమం, రుద్ర సహిత చండీ హోమాలను వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించి, పూర్ణాహుతితో కార్యక్రమాన్ని సంపన్నం చేశారు. ఈ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా భక్తులకు జగద్గురువుల దివ్యోపదేశం చేశారు.

శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ఆ సందర్భంగా విద్యారణ భారతీయ స్వామి మాట్లాడుతూ “దేవాలయం అంటే కేవలం కోరికలు తీర్చుకునే కేంద్రం కాదు.. అది ఒక గొప్ప ఆధ్యాత్మిక స్ఫూర్తి కేంద్రం. ఇక్కడ లభించే ప్రశాంతతను మనం అనుభవంలోకి తెచ్చుకోవాలన్నారు. దైనందిన అలవాట్లులో మార్పు చేసుకోవాలన్నారు. “మనుషులు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండటానికి ప్రతిరోజూ సూర్య నమస్కారాలు ఆచరించాలని, దీనివల్ల మనకు అపారమైన శక్తి లభించడమే కాకుండా, అంతా శుభం జరుగుతుందన్నారు. “సమాజంలో మనం విడిపోతే పడిపోతాం.. అదే కలిసి ఉంటే బలంగా ఉంటాం. ఐక్యమత్యమే మహా బలం, ఇదే ధర్మ మార్గం” అన్నారు.

మహిళలకు కూడా పై నినాదం వర్తిస్తుందన్నారు. ఎందుకంటే మహిళలు తమ వెంట్రుకలను గట్టిగా అల్లుకొని ముడి వేసుకుంటే వెంట్రుకలు బలంగా ఉంటాయని, లేదు ఫ్యాషన్ కోసం విరబోసుకునే విధంగా చేస్తే జుట్టు రాలిపోయి బలహీన పడతారని స్వామీజీ సందర్భంగా అన్నారు. తలకు నూనె పెట్టుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నడవాలన్నా, వాహనాలు నడవాలన్నా ఆయిల్ ప్రాముఖ్యత ఎంత ఉందో, మనిషికి తలపై ఆయిల్ పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యమైందన్నారు. తలలో ఉండే మెదడు సరిగా పనిచేయాలన్న నూనె రాయడం తప్పనిసరి అన్నారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

Read Also: అటవీ అడ్డంకులు.. అంధకారంలో ఆదివాసీ గూడెం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>