కలం, మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్‌నగర్ (Mahabubnagar) పట్టణంలోని అనేక ప్రైవేట్ పాఠశాలలు పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, బెల్టులు, షూలు తదితర వస్తువుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేల రూపాయలు (Private Schools Fee) వసూలు చేస్తూ ఆర్థికంగా తీవ్ర భారం మోపుతున్నాయని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారుల బృందాలను ఏర్పాటు చేసి, ప్రైవేట్ పాఠశాలల్లో అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించి ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది.
ఈ మేరకు శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారికి (DEO) వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ (AISF) రాష్ట్ర సహాయ కార్యదర్శి సి .రాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం ఇప్పటికే అనేక సమస్యలను ఎదుర్కొంటున్న తరుణంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే ప్రతిపాదనలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, పేద, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అలాగే ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల (Private Schools Fee) వసూళ్లను నియంత్రించేందుకు ఫీజు నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టం–2009 ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించి ఉచిత విద్య అందించే నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు రాజశేఖర్ ,లక్ష్మణ్, నాయకులు నరసింహ, ధర్మేంద్ర, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: తండ్రి కల కోసం రూ.30 కోట్ల ఆస్పత్రి.. ప్రవీణ్ లక్ష్యం 2028
Follow Us On: Instagram

