కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ను తెలంగాణ (Telangana) రాష్ట్రంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, సర్ కోసం నియమితులైన సిబ్బందితో ఇప్పటికే పలుమార్లు సమీక్షలు జరిపి.. వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. షెడ్యూల్ ప్రకారం 24వ తేదీ వరకు ఎన్యుమరేషన్ ఫారాల ముద్రణ, బూత్ లెవల్ ఆఫీసర్లకు శిక్షణ ఇవ్వబోతున్నారు. 25 నుంచి ‘సర్’ అసలు కార్యక్రమం మొదలవుతుంది. ప్రతి ఓటరు వివరాలను పరిశీలించి, అర్హుల పేర్లతో కొత్త జాబితాను రూపొందిస్తారు. వీరికి మాత్రమే ఓటర్ కార్డులు అందించి, ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించబోతున్నారు.
తొలగింపు కాదు.. ప్రక్షాళనే అంటున్న ఈసీ
సర్ ప్రక్రియ కేవలం ఓటర్ల జాబితా ప్రక్షాళన తప్ప, తొలగింపు కాదని రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 88.13 లక్షల మంది ఓటర్ల వివరాలు అస్పష్టంగా ఉన్నట్లు ఈసీ గుర్తించింది. సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోలు ఇంటింటి సర్వే నిర్వహించి, అసలు ఓటర్లు ఎవరో తేల్చబోతున్నారు. ఒకసారి సర్వే మొత్తం పూర్తయిన తరువాత జులై 31న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేస్తారు. దీనిలో పేర్లు లేకపోయినా.. తప్పులు దొర్లినా జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ ప్రక్రియ సెప్టెంబరు 28 నాటికి పూర్తి చేసి, రాష్ట్రంలోని తుది ఓట రు జాబితాను అక్టోబరు 1న ప్రచురిస్తారు.

