కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్ కోతిరాంపూర్ సెక్టార్ పరిధిలోని లక్ష్మి నగర్ అంగన్‌వాడీ కేంద్రం (Anganwadi Centers) లో ‘అమ్మ మాట – అంగన్‌వాడీ బాట’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సోమవారం ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల పునఃప్రారంభాన్ని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు , కార్పొరేటర్లు మాసం గణేష్ , దేవసాని సరస్వతీ, సత్యనారాయణ కలిసి అధికారికంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐసీడీఎస్ సీడీపీఓ కవిత మాట్లాడుతూ.. నేటి నుండి అంగన్‌వాడీ కేంద్రాలు పునఃప్రారంభమైనట్లు ప్రకటించారు. ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా అంగన్‌వాడీ కేంద్రాలలో నాణ్యమైన విద్యాబోధన అందుతుందని ఆమె స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రవేశపెట్టిన కొత్త ప్రీ-స్కూల్ కరికులమ్, లభిస్తున్న మౌలిక సదుపాయాలు పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి. ఇక్కడి ప్రీ-స్కూల్ యాక్టివిటీస్ ద్వారా పిల్లల్లో మేధోశక్తి పెరగడమే కాకుండా, మంచి అలవాట్లు, తోటి పిల్లలతో కలిసిమెలిసి ఉండే గుణం అలవడుతుంది.” అని ఆమె పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న 38వ డివిజన్ కార్పొరేటర్ దేవసాని సరస్వతి – సత్యనారాయణ, 39వ డివిజన్ కార్పొరేటర్ మాసం గణేష్ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాలలో కొత్తగా పిల్లల నమోదు (అడ్మిషన్లు) పెంచేందుకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న ఇలాంటి అద్భుతమైన పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
విద్యారంభ సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం ముగింపులో భాగంగా, అంగన్‌వాడీ విద్యను పూర్తి చేసుకుని ప్రాథమిక పాఠశాలల్లో చేరడానికి సిద్ధంగా ఉన్న 5 ప్లస్ (5+) సంవత్సరాల పిల్లలకు ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా ‘విద్యారంభ సర్టిఫికెట్లను’ పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీడీపీఓ కవితతో పాటు, కార్పొరేటర్లు మాసం గణేష్, దేవసాని సరస్వతి – సత్యనారాయణ, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎస్. అరుణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరీష్, అంగన్‌వాడీ టీచర్ పద్మ, ఆర్పీలు, ఏఎన్ఎం, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

