తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి: వికాస్ రాజ్

కలం, వెబ్ డెస్క్: జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని (Telangana Formation Day) వైభవంగా నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం సంబంధిత అధికారులతో ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సీఎం రేవంత్ ముందుగా గన్ పార్క్ ను సందర్శించి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తారని తెలిపారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ వేడుకల్లో పాల్గొంటారని చెప్పారు.

ఫార్మేషన్ డే దృష్ట్యా పరేడ్ గ్రౌండ్, గన్ పార్కు వద్ద చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు వికాస్ రాజ్ దిశానిర్దేశం చేశారు. ఈ వేడుకల ఏర్పాట్లపై ప్రతి శాఖ నుంచి ఒక నోడల్ అధికారి నియమించి సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రముఖులు ప్రయాణించే మార్గాలలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్ కు వచ్చే వాహనాలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేసి ట్రాఫిక్ రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలన్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. వాటర్ ప్రూఫ్ షామియానాలు, బారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖను ఆదేశించారు.

సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ తోపాటు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను ఆయన ఆదేశించారు. వేడుకలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు లైవ్ టెలికాస్ట్ ఏర్పాట్లు చేయాలని సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ను ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ నుంచి పరేడ్ గ్రౌండ్ వద్ద అన్ని విభాగాలు సంయుక్తంగా రిహార్సల్స్ చేపట్టాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>