కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీజర్లు మొరాయిస్తున్నా పట్టించుకొనే నాథుడే లేకుండా పోయాడు. మృతదేహాలను బయటే ఉంచాల్సిన దుస్థితి నెలకొన్నది. ఇంత జరిగినా సిబ్బందికి చీమ కుట్టినట్టైనా లేకపోవడం గమనార్హం. మృతదేహాలను భద్రపరిచేందుకు ఆస్పత్రి సిబ్బంది అవస్థలు పడుతున్నారు. రెండ్రోజుల క్రితం అనాథ మృతదేహాన్ని భద్రపరిచేందుకు ఫ్రీజర్లు మొరాయించడంతో సిబ్బంది మృతదేహాన్ని బయటే ఉంచారు. దీంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
ఎవరిదీ నిర్లక్ష్యం
వారం నుంచి ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తుందని ప్రజల ఆరోపిస్తున్నారు. అనాథ శవాన్ని బయట ఉంచడంతో ఈ విషయం బయటకు వచ్చింది. చాలా కాలంగానే ఫ్రీజర్లు మొరాయిస్తున్న విషయం ఆస్పత్రి సిబ్బందికి తెలిసే ఉంటుందని అయినా ఎందుకు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వెంటనే వైద్యశాఖ స్పందించి ఫ్రీజర్లను బాగుచేయించాలని.. నిర్లక్ష్యం వహించిన సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

