కలం, భువనగిరి : ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైస్ మిల్లర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని, ఎలాంటి అక్రమాలకు పాల్పడినా సహించేది లేదని భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే (Bhongir MLA) కుంభం అనిల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం పోచంపల్లి, బీబీనగర్ మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను ఆయన అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామంలోని ఇంద్రాకిలాద్రి రైస్ మిల్లును తనిఖీ చేసిన ఎమ్మెల్యే, అనంతరం జూలూరు ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు బీబీనగర్ మండలం రుద్రవెల్లి ప్యాక్స్ (పీఏసీఎస్) ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ, తాలు శాతం, లారీల లభ్యత, హమాలీల కొరత రాకుండా తీసుకుంటున్న చర్యలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రతి రైస్ మిల్లు, ఐకేపీ, ప్యాక్స్ కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ రైతులకు ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని, అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలతో పాటు, అవసరమైతే స్థానిక ఫంక్షన్ హాళ్లను కూడా ధాన్యం నిల్వ కోసం వినియోగించుకోవాలని సూచించారు. లారీల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుని, రవాణా ప్రక్రియను వేగవంతం, పారదర్శకం చేయాలన్నారు. అనంతరం జూలూరు రైతు వేదికలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రైతు పక్షపాతంగానే ఆలోచిస్తుందని, గత రెండేళ్లుగా ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి ధాన్యం సేకరిస్తోందని గుర్తుచేశారు. అక్కడక్కడ ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలను అన్ని శాఖల సమన్వయంతో పరిష్కరిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే ధాన్యం ఎగుమతి సమస్యలు వస్తున్నాయని, బీజేపీ నాయకులు దీనిపై కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్షా సమావేశంలో తాము చేసిన విజ్ఞప్తికి స్పందించి, మూసి పరివాహక ప్రాంతాల్లో 30 వేల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ కోటాను ప్రభుత్వం వెంటనే మంజూరు చేసిందన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఎకరానికి ఉన్న 80 బస్తాల ట్యాబ్ పరిమితిని ఎమ్మెల్యే చొరవతో 100 బస్తాలకు పెంచారని, రైతులు అమ్ముకున్న ధాన్యానికి సంబంధించిన డబ్బులను కేవలం 48 గంటల్లోనే నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు. మే నెలాఖరు నాటికి వడ్ల కొనుగోలు ప్రక్రియ మొత్తం పూర్తయ్యేలా కసరత్తు చేస్తున్నాం. తాలు ఎక్కువగా ఉన్న చోట రైతులు, మిల్లర్లు పరస్పర సమన్వయంతో వ్యవహరించాలని, రూ.18.5 కోట్ల వ్యయంతో త్వరలోనే జూలూరు–రుద్రవెల్లి బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి గానీ, అధికారుల దృష్టికి గానీ తీసుకురావాలని కోరారు.

