దళిత స్పీకర్‌పై దుర్భాషలు.. ప్రజాస్వామ్యంపై దాడి: రాజేందర్‌రావు

కలం, కరీంనగర్: దళితుడైన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ ను కించపరిచేలా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు దుర్భాషలాడడం, అతనిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని కాంగ్రెస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు (Velchala Rajender Rao) మండిపడ్డారు. ఈ మేరకు ఎమ్మెల్సీ అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సోమవారం మీడియాతో రాజేందర్ రావు మాట్లాడుతూ.. స్పీకర్‌ను ఏకవచనంతో సంబోధిస్తూ, ‘ఎవడ్రా వాడు’ అంటూ అవమానకరంగా మాట్లాడటం తాతా మధు అహంకారానికి పరాకాష్ట అని ఫైర్ అయ్యారు.

కఠిన చర్యలు తీసుకోవాలి..

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ను అవమానించడం ఒక వ్యక్తిని కించపరచడం మాత్రమే కాదని.. దళిత సమాజాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని రాజేందర్‌రావు విమర్శించారు. శాసనసభ స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. దళిత స్పీకర్‌పై కులపరమైన దూషణలకు పాల్పడిన తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

జీవితకాలం  పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలి..

తాతా మధు (Tata Madhu) ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసే దిశగా శాసనమండలి చైర్మన్ చర్యలు చేపట్టాలని రాజేందర్ రావు డిమాండ్ చేశారు. ఇలాంటి భాషను మరోసారి ఎవరూ ఉపయోగించకుండా కఠినమైన శిక్షలు విధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజాప్రతినిధులు విధానాలను విమర్శించవచ్చని, ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చని.. కానీ రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులను వ్యక్తిగతంగా దూషించడం, అవమానించడం ప్రజాస్వామ్యంలో ఎంతమాత్రం సమర్థనీయం కాదని అన్నారు.

ఒక దళిత నేతకు జరిగిన అవమానంగా మాత్రమే ఈ ఘటనను చూడకూడదని.. ఇది ప్రజాస్వామ్యానికి జరిగిన అన్యాయంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్ట సభలు, ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాత మధు జీవితకాలం చట్టసభలకు పోటీ చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>