కలం, నిర్మల్ : ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న స్కావెంజర్స్ కార్మికులను అన్‌స్కిల్డ్ కార్మికులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సోమవారం స్కావెంజర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ (CITU) జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో స్కావెంజర్స్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
జీవో నెం.60 ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని, పాఠశాలల్లో రోజువారీ హాజరు నమోదు కోసం పారదర్శక విధానం ఏర్పాటు చేయాలని, వేతనాలను ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న స్కావెంజర్స్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు నారాయణ, ఉపాధ్యక్షుడు పోశెట్టి, లక్ష్మీ, రాజేశ్వర్, సంగీత, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

