యూజీసీ నెట్‌ పరీక్షల ఏర్పాట్లపై అదనపు కలెక్టర్‌ కీలక ఆదేశాలు

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) అర్హత కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో నిర్వహించే యూజీసీ నెట్ పరీక్షలను మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాలో ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ (Madhusudan Naik) ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో విద్య, పోలీస్, విద్యుత్, ఆర్టీసీ, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులతో జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూజీసీ నెట్ పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జిల్లా కేంద్రంలోని ఎంఎస్‌ఎస్ ఇన్ఫోటెక్ సర్వీసెస్, ఫాతిమా విద్యాలయ, క్రిస్టియన్‌పల్లి పరీక్షా కేంద్రాల్లో యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 9న ఉదయం, సాయంత్రం రెండు షిఫ్టుల్లో, సెప్టెంబర్ 10న మొదటి షిఫ్ట్‌లో ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ తదితర సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్రాలకు సమీపంలోని 200 నుంచి 300 మీటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను తాత్కాలికంగా మూసివేయాలని సూచించారు.

పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ వెరిఫికేషన్, సీసీటీవీ కెమెరాల నిఘా, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి సౌకర్యాలను సమర్థవంతంగా కల్పించాలని అధికారులకు సూచించారు. అభ్యర్థుల రవాణా సౌకర్యార్థం పరీక్షా కేంద్రాలకు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స సేవలు, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సూచించారు. దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తూ పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎన్‌టీఏ జారీ చేసిన అడ్మిట్ కార్డుతో పాటు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ లేదా పాస్‌పోర్ట్ వంటి ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. బయోమెట్రిక్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. అలాగే మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర నిషేధిత వస్తువులను పరీక్షా కేంద్రంలోకి తీసుకురావద్దని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఎన్.బి. రత్నం, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ వై. సురేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి, ఎన్‌ఐసీ అధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>