కలం, నారాయణపేట: నారాయణపేట జిల్లాలో వినాయక నిమజ్జనాల సందర్భంగా యువత డీజేలు పెట్టుకోవద్దని ఎస్పీ వినీత్ (SP Vineeth) సూచించారు. జిల్లా కేంద్రంలోని చౌక్ బజార్ సమీపంలో శ్రీ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయక మండపం వద్ద సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎస్పీ వినీత్ ముఖ్య అతిథిగా హాజరై వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో నిర్వహించుకోవాలని సూచించారు. పోలీసు శాఖ సూచించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ కోరారు.

