కలం, బైంసా: భైంసా మండల (Bhainsa Mandal) కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్(MLA Pawar Ramarao Patel) హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. తాగునీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ, విద్య, వైద్యం తదితర మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
సర్పంచులు తెలిపిన సమస్యలను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ విన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి రాజకీయ పక్షపాతానికి తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.

