కలం, ఖమ్మం బ్యూరో: వరకట్న వేధింపుల కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష పడింది. శిక్షతోపాటు రూ.5,000 జరిమానా విధిస్తూ ఖమ్మం (Khammam Court) 2వ అదనపు జేఎఫ్‌సీఎం కోర్టు న్యాయమూర్తి వై. బిందుప్రియ సోమవారం తీర్పునిచ్చారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం, పాత కాచారం గ్రామానికి చెందిన మదినేని బోసుబాబుపై ముదిగొండ పోలీస్ స్టేషన్‌లో 2020లో498-ఏతోపాటు వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్లు 3, 4 ప్రకారం కేసు నమోదైంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న బోసుబాబుపై కోర్టులో సాగిన విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ శిక్షను ఖరారు చేశారు. ఈ కేసులో అప్పటి ముదిగొండ ఎస్సై ఎండీ మౌలానా దర్యాప్తు అధికారిగా ఉన్నారు. ప్రస్తుత ముదిగొండ సీఐ మురళి బ్రీఫింగ్ అధికారిగా వ్యవహరించారు. ఈ కేసులో ఏపీపీ గాయత్రి, సీడీవో సిహెచ్. శ్రవణ్, ప్రాసెస్ సిబ్బంది లైజన్ అధికారులు సమర్థవంతంగా పనిచేశారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రత్యేకంగా అభినందించారు.

