మత్తు పదార్థాలకు ‘నో’ చెప్పండి: ఎస్పీ శరత్ చంద్ర పవార్

కలం, నల్లగొండ బ్యూరో: మాదకద్రవ్యాల (Drugs) వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబం, సమాజానికి తీవ్ర హానిని కలిగిస్తుందని నల్గొండ (Nalgonda) జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (SP Sharath Chandra Pawar) తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా మాదకద్రవ్యాల దుర్వినియోగం నివారణపై అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ, ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. యువత చెడు స్నేహితుల ప్రభావం, ఆసక్తి లేదా ఒత్తిడి కారణంగా డ్రగ్స్ వైపు మళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు, గుండె, కాలేయం వంటి ముఖ్య అవయవాలు దెబ్బతింటాయని, మానసికంగా ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు.

అలాగే చదువుపై దృష్టి కోల్పోవడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, నేరాలకు దారితీసే పరిస్థితులు ఏర్పడవచ్చని తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ ఆఫర్ చేసినప్పుడు స్పష్టంగా “కాదు” అని చెప్పాలని, చెడు స్నేహితులను దూరంగా ఉంచుకోవాలని సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినప్పుడు వెంటనే 100 లేదా 1908 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. డ్రగ్స్ వినియోగం చట్టపరంగా నేరమని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే చెడు అలవాట్లు, వ్యసనాలను దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవరావు, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, ఉమెన్ & చైల్డ్ సేఫ్టీ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>