కలం, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ మహిళా ఎంపీ గెనీబెన్ ఠాకూర్‌పై గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు జగదీశ్ విశ్వకర్మ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎంపీపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఎక్స్ వేదికగా రాహుల్ ఓ పోస్టు చేశారు. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడి వ్యాఖ్యలతో బీజేపీ “నారీ వందనం” ముసుగు తొలగిపోయిందని రాహుల్ అన్నారు. బీజేపీ ప్రచారం చేసే నారీ వందనం అనేది కేవలం ఒక ముసుగు మాత్రమేనని, ఆ ముసుగు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయిందని వ్యాఖ్యానించారు. గెనీబెన్ ఘటన బీజేపీకి మహిళల పట్ల ఉన్న నిజమైన వ్యతిరేక, మనువాద భావజాలాన్ని బయటపెట్టిందని విమర్శించారు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించే మహిళలను బీజేపీ ఏమాత్రం సహించలేదని, వారి వికృత ఆలోచనా విధానం ఇలాటి సందర్భాల్లోనే బయటపడుతుందని రాహుల్ ఆరోపించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ గతంలో మహిళల గురించి మాట్లాడిన కొన్ని మాటలను రాహుల్ గుర్తు చేశారు. మహిళ దేన్నైనా మర్చిపోతుందేమో కానీ , తనకు జరిగిన అవమానాన్ని ఎప్పటికీ మర్చిపోదని మోదీ అన్నారని రాహుల్ వెల్లడించారు. మోదీ సొంత పార్టీ నేతలే ఆ మాటలను మర్చిపోయి మహిళలను అవమానిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మహిళా ఎంపీలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రధాని మోదీ పార్లమెంట్ నుంచే పారిపోతున్నారని విమర్శించారు. మహిళలను కించపరిచే బీజేపీకి గుజరాత్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ తగిన బుద్ధి చెప్తారని అన్నారు.

