కలం, నకిరేకల్ : నకిరేకల్ (Nakrekal) నియోజకవర్గ పరిధిలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రహదారుల విస్తరణ పనులకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చిట్యాల–భువనగిరి ఇరుకైన సింగిల్ రోడ్డు కారణంగా నిత్యం వాహనదారులు పడుతున్న ఇబ్బందులను, ఎదురవుతున్న ప్రమాదాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, రోడ్డు విస్తరణకు పరిపాలనా అనుమతులు సాధించడంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విజయవంతమయ్యారు.
ఈ రహదారి విస్తరణ పనులకు త్వరలోనే మంత్రి వెంకటరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో, గురువారం నాడు శంకుస్థాపన స్థలాన్ని సంబంధిత అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన సూచనలు చేశారు. స్థల పరిశీలన అనంతరం రామన్నపేట మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలోని ఒక టీ స్టాల్ వద్ద ప్రభుత్వ విప్ వేముల వీరేశం కాసేపు ఆగారు.
అక్కడ చాయ్ తాగుతూ స్థానిక ప్రజలు, సామాన్యులతో ఎంతో ఆత్మీయంగా ముచ్చటించారు. వారి కష్టసుఖాలను, గ్రామంలోని సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ దృష్టికి తెచ్చిన పలు సమస్యలను నోట్ చేసుకున్న ఎమ్మెల్యే, వాటి తక్షణ పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నార్కట్‌పల్లి రోడ్డు విస్తరణకు త్వరలోనే శ్రీకారం..
మరోవైపు నార్కట్‌పల్లి పట్టణ రోడ్డు విస్తరణ పనులపై ఉన్న అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వ విప్ కీలక అడుగు వేశారు. గురువారం స్థానిక వ్యాపారులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నార్కట్‌పల్లి రోడ్డు విస్తరణకు సంబంధించిన సమస్యలను వినతిపత్రం ద్వారా ఎమ్మెల్యేకు స్థానికులు వివరించారు.
ఈ సమావేశంలో వేముల వీరేశం మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, పరిపాలనా జాప్యాల వల్ల ఎన్నో సంవత్సరాలుగా నార్కట్‌పల్లి రోడ్డు విస్తరణ పెండింగ్‌లో ఉండిపోయిందని, ఆ జాప్యానికి ముగింపు పలికే సమయం వచ్చిందని స్పష్టం చేశారు. “స్థానిక వ్యాపారుల అభిప్రాయాలను పూర్తిగా గౌరవిస్తాం. ప్రజలకు కనీస ఇబ్బందులు కలగకుండా, అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ అత్యంత త్వరలోనే నార్కట్‌పల్లి రోడ్డు విస్తరణ పనులను ప్రారంభిస్తాం. నార్కట్‌పల్లి సమగ్ర అభివృద్ధికి మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది.” అని వీరేశం చెప్పుకొచ్చారు.

