కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట (Siddipet) జిల్లా చేర్యాల మండల కేంద్రంలో మంగళవారం రాత్రి తీవ్ర కలకలం రేపిన దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహేతర సంబంధం పెట్టుకొని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడనే ఆగ్రహంతో తండ్రిపై సొంత కుమారులే గొడ్డలితో హత్యాయత్నానికి పాల్పడ్డారు. చేర్యాలకు చెందిన బోదాసు రవి(45) అనే వ్యక్తి మరొక యువతితో సంబంధం పెట్టుకొని, తమ కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదని అతడి కుమారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధ రాత్రి తండ్రితో గొడవపడిన కుమారులు సాయికిరణ్, సాయిచరణ్‌లు ఆవేశంతో గొడ్డలితో అతడిపై దాడి చేశారు.
ఈ దాడిలో రవి మెడ, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. రవి కేకలు వేయడంతో గమనించిన బంధువులు, స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అతడిని కాపాడారు. తీవ్రంగా గాయపడిన రవిని ప్రథమ చికిత్స నిమిత్తం ముందుగా చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ నిర్లక్ష్యం, వివాహేతర సంబంధమే ఈ దాడికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. సాయికిరణ్, సాయిచరణ్‌లపై ఆరోపణల మేరకు దర్యాప్తు చేపట్టారు.

