మాంచెస్టర్ సిటీకి షాక్.. రూల్స్ అతిక్రమణలో దోషి!

కలం, స్పోర్ట్స్ : ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఆర్థిక నిబంధనల ఉల్లంఘన కేసులో దిగ్గజ ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ సిటీ (Manchester City) దోషిగా తేలింది. 2009 నుంచి 2018 వరకు తొమ్మిదేళ్ల పాటు క్లబ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని స్వతంత్ర కమిషన్ సంచలన తీర్పు ఇచ్చింది. అయితే కమిషన్ ఇచ్చిన ఈ ముగింపును సవాలు చేస్తూ అప్పీల్ ప్రక్రియకు వెళ్తామని మాంచెస్టర్ సిటీ స్పష్టం చేసింది.

కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. 2018లో మాంచెస్టర్ సిటీ ఆర్థిక వ్యవహారాలపై ప్రీమియర్ లీగ్ విచారణ ప్రారంభించింది. అనంతరం 2023లో క్లబ్‌పై 100కు పైగా అభియోగాలు మోపింది.ఈ వ్యవహారంపై 2024 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు మూడు నెలల పాటు కమిషన్ సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఈ సుదీర్ఘ విచారణ క్రమంలో క్లబ్ ఏమాత్రం సహకరించలేదని, దర్యాప్తును అడ్డుకునేందుకు ప్రయత్నించిందని లీగ్ ఆరోపించింది. పరిశీలనలో స్పాన్సర్‌షిప్ ఒప్పందాల పేరుతో క్లబ్ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. స్పాన్సర్ కంపెనీలు కొంత మొత్తమే చెల్లించగా, మిగిలిన మొత్తాన్ని క్లబ్ యజమాన్య సంస్థ ‘అబుదాబి యునైటెడ్ గ్రూప్’ నేరుగా నిధుల రూపంలో సమకూర్చింది.

ఇలా దాదాపు 900 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.9,900 కోట్లు) మేర ఆదాయాన్ని కృత్రిమంగా పెంచి చూపించి, ఖర్చులను తగ్గించి రికార్డుల్లో చూపినట్లు కమిషన్ ఆధారాలు సేకరించింది. ఈ తీర్పుపై మాంచెస్టర్ సిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కమిషన్ అభిప్రాయాల్లో చట్టపరమైన, వాస్తవిక లోపాలు ఉన్నాయని స్పష్టం చేసింది. త్వరలోనే తమ వద్ద ఉన్న బలమైన ఆధారాలతో అప్పీల్ దాఖలు చేస్తామని క్లబ్ ప్రతినిధులు ప్రకటించారు. మరోవైపు, ఈ నిర్ణయంతో మాంచెస్టర్ సిటీ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. లీగ్ నిబంధనల ప్రకారం క్లబ్‌పై జరిమానాతో పాటు పాయింట్ల కోత లేదా లీగ్ నుంచే బహిష్కరించే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఒకే ఒక్క ఉల్లంఘనకు ఎవర్టన్, నాటింగ్‌హామ్ ఫారెస్ట్ క్లబ్‌లకు పాయింట్ల కోత విధించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>