కలం, వెబ్ డెస్క్: రేవంత్ సర్కార్ సింగరేణి (జైపూర్) విద్యుత్‌ను రాజస్థాన్‌కు కట్టబెడుతోందని.. ఈ జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) బహిరంగ లేఖ రాశారు. రాజస్థాన్ విద్యుత్ ఒప్పందాన్ని (Rajasthan Power Deal) తక్షణమే రద్దు చేసుకోకపోతే బీఆర్ఎస్ తీవ్ర పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
తెలంగాణలో కరెంట్ లేక రైతాంగం ఇబ్బందులు పడుతుంటే ఇతర రాష్ట్రాలకు కరెంటును ఎలా ఇస్తారని ప్రశ్నించారు.రాష్ట్రంలో తక్కువ ఖర్చుతో ఉత్పత్తయ్యే విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ధారాదత్తం చేయడం ప్రజా వ్యతిరేక చర్య అవుతుందన్నారు. బొగ్గు మనది, నీళ్లు మనవి, స్థలం మనది.. కానీ మంచిర్యాల జైపూర్ (సింగరేణి)లో తయారయ్యే 800 మెగావాట్ల కరెంటు మాత్రం రాజస్థాన్‌కా ? అంటూ నిలదీశారు.
సింగరేణి (Singareni) నుంచి దాదాపు 22 వేల కోట్ల పెట్టుబడిని రాజస్థాన్ అభివృద్ధికి ఎందుకు మళ్లించాలి? అని ప్రభుత్వాన్ని హరీశ్ రావు ప్రశ్నించారు. యాదాద్రి విద్యుత్ ప్లాంటుకు జీ10, జీ11 గ్రేడ్ బొగ్గు వాడాలి కానీ.. నాసిరకం జీ13, జీ14 బొగ్గు వాడి బాయిలర్లు దెబ్బతినేలా చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణిలో కృతిమ బొగ్గు కొరత సృష్టించి కొత్తగూడెం 800 MW, భద్రాద్రి 540 MW కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిపేశారని అన్నారు.
రాష్ట్రానికి ఎలాంటి అదనపు భారం లేకుండా ఎన్‌టీపీసీ ఇచ్చే 1600 మెగావాట్ల విద్యుత్ ను వద్దు అని చెప్పడానికి మీరెవరు? అంటూ ప్రశ్నించారు. విభజన హామీ ప్రకారం ఎన్టీపీసీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ కోసం తక్షణమే పీపీఏ ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

