epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సోనియాకు ఢిల్లీ హైకోర్టు నోటీసు షాక్.. పౌరసత్వం ముందే వోటర్ లిస్ట్‌లో పేరు?

కలం డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ (Sonia Gandhi)కి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. భారతదేశంలో ఆమె పౌరసత్వం తీసుకోడానికి మూడేండ్ల ముందే ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకున్నారన్న వివాదంలో స్పెషల్ జడ్జి విశాల్ గాగ్నే ఈ నోటీసులు ఇచ్చారు. జనవరి 6వ తేదీన తదుపరి విచారణ జరగనున్నట్లు పేర్కొన్నారు. ఆమె పౌరసత్వం, ఓటర్‌గా పేరు నమోదు విషయంలో గతంలోనే ఒక వివాదం తెరమీదకు వచ్చింది.

మేజిస్ట్రేట్ కోర్టులోనూ ఈ అంశంపై విచారణ జరిగింది. సోనియాగాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టును పిటిషనర్ కోరారు. కానీ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ వైభవ్ చౌరాశియా అందుకు నిరాకరించారు. దీన్ని సవాలు చేస్తూ పిటిషనర్ వికాస్ త్రిపాఠి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని స్పెషల్ జడ్జి విశాల్ గాగ్నే విచారణకు స్వీకరించి, సోనియాగాంధీతో పాటు పోలీసుల వివరణ తీసుకోవడం సముచితంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. వారి నుంచి వచ్చే వివరణలకు అనుగుణంగా జనవరి 6వ తేదీన జరిగే తదుపరి విచారణలో మరింత స్పష్టత వస్తుందన్నారు.

వివాదం మొదలైంది ఇలా… :

సోనియాగాంధీ (Sonia Gandhi)కి పౌరసత్వం రాకముందే ఓటర్ల జాబితాలో పేరు నమోదు కావడం చట్టరీత్యా చెల్లదని భావించిన వికాస్ త్రిపాఠి సెప్టెంబరులో మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమెకు భారత ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చి 1983 ఏప్రిల్‌లో అని, కానీ ఆమె పేరు న్యూ ఢిల్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో 1980లోనే నమోదైందని ఆ పిటిషన్2లో ప్రస్తావించారు. ఆ తర్వాత 1982లో జాబితా నుంచి పేరు డిలీట్ అయ్యి మళ్ళీ 1983లో చేరిందని పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ను సెప్టెంబరు 11న విచారించిన అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ చౌరాశియా… పిటిషనర్ కోరిన విధంగా ఈ వ్యవహారంలో దర్యాప్తు జరిపించలేమన్నారు. ఆమె పౌరసత్వం వ్యవహారం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, అర్హతలను బట్టి ఓటర్ల జాబితాలో పేరు నమోదు కావడం కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోని అంశమన్నారు. దర్యాప్తుకు ఆదేశిస్తే రాజ్యాంగ వ్యవస్థల్లోకి జొరబడడమే అవుతుందని, ఇది ఆర్టికల్ 329ను ఉల్లంఘించినట్లవుతుందని వ్యాఖ్యానించారు.

ఢిల్లీ హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ :

ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ వికాస్ త్రిపాఠి ఢిల్లీ హైకోర్టులో క్రిమినల్ రివిజిన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది నారంగ్ వాదిస్తూ, పౌరసత్వం రావడానికి ముందే ఓటర్ల జాబితాలో పేరు నమోదు కావడం వెనక కొన్ని డాక్యుమెంట్ల ఫోర్జరీ జరిగి ఉంటుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఓటర్ జాబితాలో చేరి ఉండొచ్చని అన్నారు.

ఈ అనుమానంతోనే పిటిషనర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరినా ఫలితం లేదని పేర్కొన్నారు. ఛార్జిషీట్ దాఖలు చేయాలని తాము కోరడంలేదని, కనీసం వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా దర్యాప్తు జరిపించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి కొనసాగింపుగా ఢిల్లీ పోలీసులతో పాటు సోనియాగాంధీకి నోటీసులు జారీచేసిన స్పెషల్ జడ్జి.. తదుపరి విచారణను జనవరి 6వ తేదీకి వాయిదా వేశారు.

Read Also: పెట్టుబడి పెట్టే కంపెనీలివే…

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>