కలం, వెబ్ డెస్క్ : సోషల్ మీడియా (Social Media) వాడకం పూర్తిగా మారింది. ఒకప్పుడు ప్రతి చిన్న క్షణాన్ని అందరికీ షేర్ చేయడం యువతలో ట్రెండ్‌గా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. జెన్‌జీ (Gen Z) యువత తమ వ్యక్తిగత విషయాలను అందరికీ కనిపించేలా పోస్టు చేయడం తగ్గించుకుని, కేవలం ‘క్లోజ్ ఫ్రెండ్స్’ లేదా ప్రైవేట్ గ్రూపుల వరకు పరిమితం చేస్తున్నారు. 2016లో ప్రతి పుట్టినరోజు వేడుక, ప్రయాణం, ప్రతి మినిట్ లైవ్ స్ట్రీమ్ చేసేవారు. కానీ తాజా నివేదికలు సూచిస్తున్నట్లు, నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం వల్ల వచ్చే ఒత్తిడి, అలసట ఈ మార్పుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ముంబైలోని సెంటియర్ వెల్‌నెస్ డైరెక్టర్ డాక్టర్ రింపా సర్కార్ మాట్లాడుతూ.. ఇతరుల పరిశీలనలో ఎల్లప్పుడూ ఉండటం యువతపై మానసిక ఒత్తిడిని పెంచుతోందని చెప్పారు. ప్రతి క్షణాన్ని షేర్ చేయాలనే తాపత్రయం వారి స్వంత వ్యక్తిత్వాన్ని నిర్వహించడంలో సమస్యలను కలిగిస్తుందని, నిరంతర సెల్ఫ్ మానిటరింగ్ వల్ల ఆందోళన, అలసట, భావోద్వేగపరమైన నీరసం వస్తున్నాయని ఆమె వివరించారు.
కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ దివిజ భాసిన్ ప్రకారం, యువత ఇప్పుడు పరిచయస్తుల కంటే తమకు అత్యంత సన్నిహితుల నుండి వచ్చే గుర్తింపుకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి పోస్ట్‌కి ట్రోల్స్ లేదా అనవసర కామెంట్లకు సమాధానం చెప్పాల్సిన బాధ లేకుండా, తమకంటూ హద్దులు ఏర్పాటు చేస్తున్నారు. 2025 జీడబ్ల్యూఐ (GWI) యూత్ కల్చర్ రిపోర్ట్ ప్రకారం, సుమారు 57 శాతం జెన్‌జీ యువత తమ మెయిన్ అకౌంట్స్ కంటే క్లోజ్ ఫ్రెండ్స్ స్టోరీల్లో నిజాయితీగా ఉంటారని తెలిపారు.
అలాగే 63 శాతం మంది తమ కంటెంట్‌ను ఎవరు చూడాలో నియంత్రించే ప్లాట్‌ఫారమ్‌లను సురక్షితంగా భావిస్తున్నారు. డిజిటల్ డిటాక్స్ అంటే ఒకప్పుడు యాప్స్ డిలీట్ చేయడం అని మాత్రమే భావించేవారు. కానీ ఇప్పుడు అది ఫిల్టర్, ఫన్నెల్ పద్ధతిలోకి మారింది. ఒకేసారి యాప్స్ తొలగించకుండా, క్రమంగా వాడకాన్ని తగ్గించడం ద్వారా, డూమ్‌స్క్రోలింగ్, అనవసర ఆన్‌లైన్ చర్చల నుండి దూరంగా ఉండటం మానసిక ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

