Mobile Popup Ad
Mobile Popup Ad

మీ భాగస్వామి గురక వల్ల నిద్ర పాడవుతుందా? ఇంట్లోనే ఈ చిట్కాలు పాటించండి

కలం, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న సమస్య గురక. గురక.. వినేవారికి ఇరిటేషన్‌గా ఉంటుంది. ఈ సమస్యను చాలామంది ఫన్నీగా తీసుకుంటారు. కానీ దీనివల్ల ఎంతో మంది భాగస్వాముల నిద్ర పాడవుతోంది. అయితే ఈ సమస్యను పోగొట్టుకునేందుకు చాలామంది రకరకాల టాబ్లెట్లు వాడుతుంటారు. అయితే ఇంట్లోనే కొన్ని చిట్కాలు (Snoring Relief Tips) పాటించడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాం.

పక్కకు తిరిగి పడుకోండి

వెల్లకిలా పడుకున్నప్పుడు శ్వాస సరిగ్గా అందక గురక వస్తుందట. అందుకే ఓ పక్కకు తిరిగి నిద్రపోవడం వల్ల చాలా వరకూ గురక తగ్గే అవకావం ఉందని చెబుతున్నారు. పక్కకు తిరిగి నిద్రపోయినప్పుడు శ్వాస నాళాలు సరైన విధంగా తెరుచుకుని శ్వాస సరిగ్గా అందుతుందని వివరించారు. శ్వాస సరిగ్గా అందినప్పుడు గురక వచ్చే అవకాశమే ఉండదట. అందుకే గురక సమస్య ఉన్నవారు ఓ పక్కకు తిరిగి నిద్రపోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

తగిన మోతాదులో నీళ్లు తాగండి

గురకను తగ్గించుకోడానికి మరో సింపుల్ చిట్కా నీళ్లు తాగడం. చాలా మంది నీళ్లు సరిగ్గా తాగకపోవడంతో గొంతు ఎండిపోయినట్టుగా అవుతుందట. ఎప్పుడైతే గొంతు ఎండిపోతుందో అప్పుడు శ్వాసనాళాలు మూసుకుపోయినట్టుగా అవుతాయి. దీనివల్ల సరిగ్గా శ్వాస అందక గురక వస్తుందని చెబుతున్నారు నిపుణులు. నీళ్లు తాగడం వల్ల గొంతు తడి ఆరిపోకుండా ఉండి సులువుగా శ్వాస అందుతుంది. అందుకే నిద్రపోవడానికి కనీసం అరగంట ముందు ఓ గ్లాసు నీళ్లు తీసుకుంటే గురక రాకుండా ఉంటుందని సూచిస్తున్నారు డాక్టర్లు.

దిండు ఎత్తు కాస్త పెంచండి

తల భాగాన్ని కొద్దిగా ఎత్తులో ఉంచి పడుకోవడం వల్ల గొంతులోని శ్వాస నాళాలపై ఒత్తిడి తగ్గి, గాలి సులభంగా ఆడుతుంది. ఇది గురకను సహజంగానే తగ్గిస్తుంది. అలా అని మరీ ఎత్తుగా ఉండే దిండు వాడకూడదట. దీని వల్ల మెడ కండరాలు పట్టేసే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ఆవిరి పట్టడం

నిద్రపోవడానికి ఓ అరగంట ముందు ఆవిరి పట్టడం వలన గురక సమస్య తగ్గుతుందట. సాధారణంగా శ్వాస నాళాలు క్లియర్‌గా లేనపుడు గురక వస్తుందట. అందుకే ఆవిరి పెట్టుకోవడం వల్ల ముక్కు క్లీన్ అవుతుంది. శ్వాస సరిగ్గా అందడం వల్ల ఎలాంటి గురక రాదు. మామూలు నీళ్లతో కాకుండా అందులో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ కూడా వేసి ఆవిరి పడితే ఇంకాస్త త్వరగా రిజల్ట్ కనిపిస్తుందని చెబుతున్నారు డాక్టర్లు.

గొంతు ఎక్సర్ సైజ్‌లు చేయండి

గొంతు ఎక్సర్ సైజ్‌లు చేయడం, గొంతు కండరాల్లో కదలికలు వచ్చేలా వ్యాయామం చేయడం వలన గురక సమస్య తగ్గుతుందట. పాటలు పాడడం, గట్టిగా మాట్లాడడం, ఏదో ఒకటి హమ్ చేయడం లాంటివి చేయడం వల్ల గొంతు కండరాల్లో కదలికలు వస్తాయట. ఆ తరవాత ఎలాంటి గురక ఇబ్బంది లేకుండా నిద్రపడుతుందని చెబుతున్నారు డాక్టర్లు.

యాలకుల అద్భుత చిట్కా

ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న యాలకులతోనూ గురక సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చట. ఇవి గొంతులో పేరుకుపోయిన కఫాన్ని, వాపును (ఇన్‌ఫ్లమేషన్‌ను) తగ్గించడమే కాకుండా, శ్వాసకోశ మార్గాన్ని క్లియర్ చేస్తాయని చెబుతున్నారు. దీనికోసం.. ఒక గ్లాసు నీళ్లలో కొన్ని యాలకుల గింజలు, కొద్దిగా అల్లం ముక్క వేసి బాగా మరిగించాలి. ఈ గోరువెచ్చటి నీటిని రాత్రి నిద్రపోవడానికి ఒక అరగంట ముందు తాగడం వలన గురక రాకుండా ఉంటుందట. క్రమం తప్పకుండా ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోయి, గురక చాలా వరకు అదుపులోకి వస్తుందని చెబుతున్నారు డాక్టర్లు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>