కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) దారుణ హత్య ఘటన కలకలం రేపింది. అనుమానంతో కట్టుకున్న భార్యనే భర్త అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. భార్యను కుర్చీకి కట్టేసి నిప్పంటించడంతో ఆమె సజీవదహనమైంది. ఈ ఘటన కన్నౌజ్ జిల్లా చిబ్రమౌ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగత్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జగత్‌పూర్ గ్రామానికి చెందిన సుఖ్‌బీర్ సింగ్ అలియాస్ మోను (35)కు 11 ఏళ్ల క్రితం సోనమ్‌తో వివాహమైంది.
ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మోను హర్యానాలోని హిసార్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా, సోనమ్ ఇద్దరు పిల్లలతో కలిసి స్వగ్రామంలోనే నివసిస్తోంది. ఇటీవల మోను గ్రామానికి తిరిగి వచ్చిన సమయంలో సోనమ్ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడటాన్ని గమనించాడు. దీంతో ఆమెకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన మోను భార్యను కుర్చీకి కట్టేసి నిప్పంటించినట్లు సమాచారం. అనంతరం ఇద్దరు పిల్లలను వెంట తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మంటలు పూర్తిగా ఆర్పేందుకు సుమారు గంటన్నర సమయం పట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో సోనమ్ పూర్తిగా కాలిపోయి కేవలం ఎముకలు మాత్రమే మిగిలాయని సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం దర్యాప్తు చేపట్టారు.
Also Read : ఉత్తరకాశిలో ఘోర ప్రమాదం: నదిలోకి దూసుకెళ్లిన కారు!
Follow Us On : WhatsApp

