Mobile Popup Ad
Mobile Popup Ad

చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే కేంద్రాలు అంగన్‌వాడీలు: సీతక్క

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో అంగన్‌వాడీల ద్వారా పిల్లల నాలెడ్జ్‌ను పెంచి, నాణ్యమైన విద్యకు బలమైన పునాది వేస్తున్నామని మంత్రి సీతక్క (Seethakka) స్పష్టం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు అని పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లా గోల్కొండ ప్రాజెక్టు పరిధిలోని మల్లేపల్లి సెంటర్, మహాత్మా గాంధీ నగర్ అంగన్‌వాడీ కేంద్రం (Anganwadi Education)లో నిర్వహించిన “అమ్మ మాట – అంగన్‌వాడీ బాట” కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ తో క‌లిసి చిన్నారుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రీ-స్కూల్ విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేసి, ప్రాథమిక పాఠశాలల్లో చేరనున్న చిన్నారులకు విద్యారంభ ధృవపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి.. ప్రీ-స్కూల్ విద్య, పోషకాహార సేవలు, బోధన సామగ్రి వినియోగాన్ని పరిశీలించి చిన్నారుల అభ్యాస పురోగతిపై ఆరా తీశారు.

చిన్నారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి..

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. బాల్యంలోనే విద్యకు బలమైన పునాది వేయడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. చిన్నారుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రతి చిన్నారి అంగన్‌వాడీలో చేరేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంగన్‌వాడీ సేవలను ప్రతి కుటుంబానికి చేరవేయడమే “అమ్మ మాట – అంగన్‌వాడీ బాట” కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే కేంద్రాలుగా అంగన్‌వాడీలను మరింత బలోపేతం చేస్తామని వివరించారు. అంగన్‌వాడీల ద్వారా లభించే సేవలపై తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని తమ పిల్లలను కేంద్రాల్లో నమోదు చేయించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే తొలి విద్యాలయాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం ప్రతి చిన్నారికి రెండు జతల యూనిఫాంలనుఅందిస్తోందని చెప్పారు. భ‌ద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన బ్రేక్‌ఫాస్ట్ పథకానికి మంచి స్పందన రావడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామ‌ని మంత్రి సీత‌క్క‌ తెలిపారు.

పోషకాహారానికి 57 రకాల కార్యక్రమాలు..

చిన్నారులకు పోషకాహారం అందించేందుకు 57 రకాల విద్యా, ఆట వస్తువులు, ఎర్లీ చైల్డ్ కేర్ కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. నర్సరీ విద్య పూర్తి చేసిన చిన్నారులకు ప్రత్యేక సర్టిఫికెట్లు కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల్లో 9 లక్షల మంది చిన్నారులు నమోదు అయ్యారని, వారి ఆరోగ్యం, విద్య, సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ఖిచిడీ, ఎగ్ బిర్యానీ వంటి పోషకాహారాన్ని అందిస్తున్నామని, అంగన్‌వాడీ టీచర్లకు ఇంగ్లీష్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో 38 వేల అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని.. సిబ్బంది కోరిక మేరకు నెలన్నర సెలవులు కూడా మంజూరు చేశామని వివరించారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించాల్సిన అవసరం లేదని.. తమ పిల్లలను అంగన్‌వాడీల్లో చేర్పించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>