కలం, వెబ్ డెస్క్: ఏపీ కూటమిలో అంతర్గత విబేధాలు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల టీడీపీ (TDP), జనసేన (Janasena) మధ్య గొడవలు జరుగుతుండగా.. మరికొన్ని చోట్ల టీడీపీ, బీజేపీ (BJP)కి అస్సలు పొసగడం లేదు. మూడు పార్టీల నేతలు బహిరంగంగానే ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్న తరుణంలో ఓ బీజేపీ నేతపై టీడీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయంశంగా మారింది. బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి (Vishnu Vardhan Reddy) కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ కదిరి (Kadiri) టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇర్ఫాన్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు కదిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విష్ణు వర్ధన్ రెడ్డి వైసీపీ ఏజెంట్ లా పని చేస్తున్నారని ఆరోపించారు.
వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అన్యాయాలపై ఏనాడూ మాట్లాడని విష్ణు వర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విష్ణువర్ధన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఎన్నికల్లో సైతం విష్ణు వర్ధన్ రెడ్డి వైసీపీకి అనుకూలంగా పని చేశారని ఆరోపించారు. బీజేపీ అధిష్టానం ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఫిర్యాదుకు ముందే విష్ణు వర్ధన్ రెడ్డి తనకు ప్రాణ హాని ఉందంటూ కదిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొంతమంది తనకు ఫోన్లు చేసి చంపేస్తామంటూ బెదరిస్తున్నారని, ఉర్దూలో మాట్లాడి బెదిరింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.

