కలం, నిజామాబాద్ బ్యూరో: దివ్యాంగులకు సేవ చేయడంలో స్నేహ సొసైటీ (Sneha Society) ముందంజలో ఉంటుందని సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ మహిపాల్, ఉపాధ్యక్షురాలు డాక్టర్ సవితా రాణి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో 34వ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సొసైటీ అధ్యక్షులు డాక్టర్ ఎం.మహిపాల్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సవితారాణి, కార్యదర్శి ఎస్.సిద్దయ్య పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సొసైటీ సేవలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభినందించడంతో పాటు అధికార యంత్రాంగం అందిస్తున్న తీరుని వివరించారు. 2025- 26 సంవత్సరంలో ఆదాయం ఖర్చులు ఇతర విషయాలను తెలియజేశారు.
మూడు ప్రాంతాల్లో సేవలు..
ప్రిన్సిపాల్ జ్యోతి మాట్లాడుతూ.. గత కలెక్టర్లు వినయ్ కృష్ణారెడ్డి, డాక్టర్ యోగితా రానా ప్రోత్సాహంతో దివ్యాంగుల అభ్యున్నతికి తమకు సహకారం అందించినట్లు వివరించారు. అంధ విద్యార్థులకు నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించడంపై ప్రత్యేకంగా అభినందించారు. నిజామాబాద్, మంచిర్యాల, భైంసా పట్టణాల్లో స్నేహ సొసైటీ (Sneha Society) సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఈ సంవత్సరం స్నేహ సొసైటీ సంస్థ సిబ్బందితో కలిసి కో-ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసి సరకులను తక్కువ ధరకు అందించబోతున్నట్లు కార్యదర్శి సిద్దయ్య ప్రకటించారు. ఈ మేరకు ఆయన్ను డాక్టర్ సవిత రాణి, స్నేహ సొసైటీ కమిటీ సభ్యులు అభినందించారు. అలాగే విద్యార్థుల సంక్షేమానికి ఏటా తమ కూతురు పుట్టిన రోజు సందర్భంగా రూ.25 వేల ఆర్థిక సహకారం, అన్న ప్రసాదం అందిస్తామని రమణారెడ్డి వివరించారు.
రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటన..
డాక్టర్ సవితారాణి మాట్లాడుతూ.. ఈ సందర్భంగా సొసైటీ దివ్యాంగుల కోసం రూ.లక్ష విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. వైద్య వృత్తి కారణంగా అనుకున్నంత సమయం సొసైటీకి కేటాయించలేకపోతున్నానని వివరించారు. ఈ పాఠశాలలో చదువుకున్న ఒక అంధ విద్యార్థిని రజిని రూ.50 వేలు ఇవ్వడంపై అభినందనలు తెలిపారు. 1992లో ఏర్పాటు చేసి అంద విద్యార్థుల పాఠశాల ప్రారంభం నుంచి ఎన్నో ప్రాజెక్టుల ద్వారా ఎంతో మంది సేవలో భాగ్యస్వాములు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ భానుప్రియ మాట్లాడుతూ.. స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సఖి సెంటర్ లో తన వంతు బాధ్యతగా సేవలు అందిస్తున్నట్లు వివరించారు. టీఐ ప్రాజెక్టు మేనేజర్ శివ మాట్లాడుతూ.. సెక్స్ వర్కర్లు ట్రాన్స్ జెండర్లు ఎయిడ్స్ నివారణ ప్రాజెక్టు ద్వారా సేవలందించే దిశగా వారి ఆరోగ్య రీత్యా బాగోగుల కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తున్నట్లు వివరించారు. అసలు స్నేహ టార్గెట్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్టు ద్వారా ఎన్నో రకాల సేవలు అందిస్తామన్నారు. కమిటీ సభ్యులు షేర్ల దయానంద్, తాటి వీరేశం, సుధాకర్, సొసైటీలోని ఆయా ప్రాజెక్టుల్లోని సిబ్బంది, టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: అజారుద్దీన్, కోదండరాంలను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ జీవో విడుదల
Follow Us On : WhatsApp

