కలం, వెబ్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు విస్తీర్ణాన్ని మాజీ సీఎం కేసీఆర్ పెంచారని.. ఆయన చేసిన అప్పు తెలంగాణకు పెట్టుబడిగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లో ఆదివారం హుజూర్‌నగర్‌కు చెందిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నాయకుడు పిల్లుట్ల రఘు చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. 60 ఏండ్లు పాలించిన ఈ కాంగ్రెస్ సన్నాసులు నల్గొండకు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. కానీ కేసీఆర్ పదేళ్లలో నల్గొండలోని చివరిమడి వరకు నీళ్లు పారేలా కృషి చేశారని కొనియాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చారని చెప్పారు. నల్గొండను వేధించిన ఫ్లోరోసిస్‌ను “మిషన్ భగీరథ”తో తరిమికొట్టిన నాయకుడు మన కేసీఆర్ అని కొనియాడారు.
దామరచర్లలో అతిపెద్ద యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను స్థాపించినది కూడా కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. యావత్ దేశ ప్రజలు అబ్బురపడేలా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో రైతుల గోస తీర్చిన వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. కేసీఆర్ 70 లక్షల మంది రైతులకు కరోనా లాంటి క్లిష్ట సమయాల్లో కూడా రైతుబంధు అందించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 1,000 గురుకులాలతో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దారని చెప్పారు. ప్రతి జిల్లాలో మెడికల్, నర్సింగ్ కాలేజీలతో వైద్య విద్యను అందించారని గుర్తు చేశారు. కరెంటు కష్టాల రాష్ట్రాన్ని 24 గంటల విద్యుత్ రాష్ట్రంగా మార్చారని వ్యాఖ్యానించారు.
ఒక్కొక్కరు కమల్ హాసన్‌ను మించిన నటులు..
కేటీఆర్ మాట్లాడుతూ.. “2023 సాధారణ ఎన్నికల కంటే మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలం పెరిగింది. స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో మొదలైన బీఆర్ఎస్ పార్టీ ప్రయాణం 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. మూడు ఫీట్లు ఉన్నోడు కూడా కేసీఆర్ మీద మాట్లాడుతున్నాడు. స్కైరూట్ మనం తెచ్చిన కంపెనీ.. దానికి రిబ్బన్ కట్ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఏవో చిన్న తప్పిదాల వల్ల నల్గొండ జిల్లాలో 11 సీట్లు కోల్పోయాం, కానీ గెలిచిన కాంగ్రెస్ ఏం చేస్తోంది? కాంగ్రెస్ లో ఒక్కొక్కరు కమల్ హాసన్‌ను మించిన నటులు ఉన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్‌లు ఏమయ్యాయి? 3 నెలల్లో పిల్లలు పుడతారా అని ప్రశ్నించిన సీఎంని నేను అడుగుతున్నా.. 30 నెలలైనా పిల్లలు పుట్టకుంటే ఏమనాలో చెప్పు అని? ఆరున్నర అడుగులు ఉన్న ఉత్తమ్ కుమార్ వల్ల ఏమీ ఉపయోగం లేదు. 2014కు పూర్వం కాంగ్రెస్ నల్గొండకు ఏం చేసింది? మూసీని దుర్గంధంతో నింపింది. ఫ్లోరోసిస్‌తో నల్గొండ వెన్నుపూస విరిచేసింది. కోదాడలో చివరి మడికి నీరు వస్తుందంటే అది కాళేశ్వరం వల్లే. రేవంత్ రెడ్డి రూ. 3 లక్షల 70 వేల కోట్ల అప్పు చేశానని ఒప్పుకున్నాడు. ఢిల్లీకి మూటలు మోయడం తప్ప.. ఏం చేసిండు మరి? రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు దాన వీర శూర కర్ణ, ఎన్నికలు అయ్యాక కుంభ కర్ణ అయ్యారా? వచ్చే ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావు.. కేసీఆర్ ను మళ్ళీ సీఎం చేసి రాష్ట్రాన్ని పునర్నిర్మించే ఎన్నికలు. ప్రతిఒక్కరు బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలి” అని పిలుపునిచ్చారు.

