Mobile Popup Ad
Mobile Popup Ad

చెన్నై కోటలో సుదర్శన్ సునామీ.. గుజరాత్‌ టైటాన్స్‌ ఘనవిజయం

కలం, వెబ్​ డెస్క్​ : చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో (CSK vs GT) సాయి సుదర్శన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెన్నై బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. కేవలం 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్, 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినా చెన్నైకి ఓటమి తప్పలేదు. గుజరాత్ బ్యాటర్లలో సుదర్శన్, బట్లర్ వీరవిహారం చేశారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఆదిలోనే షాక్ తగిలింది. కాగిసో రబడ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో సంజూ శాంసన్ (11), ఊర్విల్ పటేల్ (4), కార్తీక్ శర్మ (15) వికెట్లను పడగొట్టి చెన్నైని కోలుకోలేని దెబ్బ తీశాడు. స్టార్ బ్యాటర్లు విఫలమైన చోట కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (74 నాటౌట్; 60 బంతుల్లో, 6 ఫోర్లు, 4 సిక్సర్లు) క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. శివమ్ దూబే (22) కాసేపు సహకరించగా, చివర్లో జేమీ ఓవర్టన్ (18) వేగంగా ఆడటంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో రబడ 3 వికెట్లతో మెరవగా, అర్షద్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు.

159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (33) ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించగా, మరో ఎండ్‌లో సాయి సుదర్శన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. చెన్నై బౌలర్లను ఉతికి ఆరేస్తూ కేవలం 46 బంతుల్లోనే 87 పరుగులు (4 ఫోర్లు, 7 సిక్సర్లు) బాదాడు. గిల్ అవుట్ అయినా, జోస్ బట్లర్ (39 నాటౌట్) తో కలిసి సుదర్శన్ విజయాన్ని ఖాయం చేశాడు. విజయం ముంగిట సుదర్శన్ అవుట్ అయినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బట్లర్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

చెన్నై బౌలర్లలో అకీల్ హొస్సేన్, నూర్ అహ్మద్ చెరో వికెట్ తీసినా పరుగులను కట్టడి చేయలేకపోయారు. ముఖ్యంగా అకీల్ హొస్సేన్ 3.4 ఓవర్లలోనే 46 పరుగులు సమర్పించుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన గుజరాత్, చెన్నై గడ్డపై జెండా పాతగా.. సొంత అభిమానుల మధ్య సీఎస్కే భారీ ఓటమిని మూటగట్టుకుంది.

Read Also: మంగళసూత్రాలు, బొట్టు ధరిస్తే సస్పెండ్​ చేస్తాం.. డీజీపీ ఉత్తర్వులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>