Mobile Popup Ad
Mobile Popup Ad

నిశ్శబ్దంగా బంధాలను దెబ్బతీస్తున్న సోషల్ మీడియా అలవాట్లు ఇవే!

కలం, వెబ్‌డెస్క్: నేటి ఆధునిక ప్రపంచంలో మనుషులు మనుషులతో కంటే, స్మార్ట్‌ఫోన్లతోనే (Smartphone Addiction) ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాతోనే కాలం గడుపుతున్నారు. దీనివల్ల సమయం వృథా అవ్వడమే కాదు, బంధాలు కూడా నెమ్మదిగా చిన్నాభిన్నం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఒకే గదిలో పక్కపక్కనే కూర్చున్నా, మనసుల మధ్య వేల మైళ్ల దూరం పెరుగుతోంది. భాగస్వామితో మనసు విప్పి మాట్లాడటం కంటే స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను స్క్రోల్ చేయడమే ముఖ్యం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు చాలామంది. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా మన వ్యక్తిగత జీవితాల్లోకి తెలియకుండానే చొరబడి, అనుబంధాలను బలహీనపరుస్తోంది.

ఇతరుల జీవితాలతో పోల్చుకునే ప్రమాదకరమైన ధోరణి

సోషల్ మీడియాలో ఇతరులు పోస్ట్ చేసే ‘పర్ఫెక్ట్’ ఫోటోలను చూసి మన జీవితం ఎందుకు అలా లేదని బాధపడటం నేడు సర్వసాధారణం అయిపోయింది. కానీ ఆ ఫోటోల వెనుక ఉన్న అసలు నిజం ఎవరికీ తెలియదు. ఈ అవాస్తవిక అంచనాలు భాగస్వామిపై అసంతృప్తిని పెంచి, లేనిపోని గొడవలకు దారితీస్తున్నాయి. ఎదుటివారి విలాసవంతమైన జీవితాన్ని చూసి మనకున్న దానితో తృప్తి చెందలేకపోవడం బంధాల్లో చీలికలు తెస్తోందని చెబుతున్నారు నిపుణులు.

అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లేదా ఫేస్‌బుక్ స్టేటస్‌లను చూసి మన భాగస్వామిని తక్కువ చేసి చూడటం వల్ల వారిలో ఆత్మన్యూనతా భావం పెరుగుతుంది. ఇది క్రమంగా ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవాన్ని తగ్గించి, మానసిక దూరాన్ని పెంచుతుందట.

భాగస్వామి ఏదైనా ముఖ్యమైన విషయం చెబుతున్నప్పుడు లేదా పక్కనే ఉన్నప్పుడు వారిని పట్టించుకోకుండా ఫోన్ చూస్తూ ఉంటారు కొంతమంది. ఇది ఎదుటి వ్యక్తికి తాము ముఖ్యం కాదనే భావనను కలిగిస్తుందట. ఇలాంటి ప్రవర్తన వల్ల దంపతుల మధ్య భావోద్వేగ దూరం పెరిగి, పరస్పర నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మైక్రో-చీటింగ్

స్నేహానికి, ద్రోహానికి మధ్య ఉన్న సన్నని గీత పాత ప్రేమికుల ఫోటోలకు లైక్ కొట్టడం లేదా అపరిచితులతో అర్థరాత్రి వరకు చాటింగ్ చేయడం వంటివి చాలామందికి సాధారణంగా అనిపించవచ్చు. కానీ ఇవే నమ్మక ద్రోహానికి పునాది వేస్తాయట. దీనినే ‘మైక్రో-చీటింగ్’ అని పిలుస్తారు, ఇది శారీరక ద్రోహం కంటే మానసిక ద్రోహంగా పరిగణించబడుతుంది. చాలా సందర్భాల్లో భాగస్వామికి తెలియకుండా చేసే ఆన్‌లైన్ సంభాషణలు అనుమానాలకు దారితీస్తాయి. ఒకసారి నమ్మకం దెబ్బతింటే, ఆ బంధాన్ని మళ్ళీ పూర్వస్థితికి తీసుకురావడం చాలా కష్టం. మీ బంధం బలంగా ఉండాలంటే కొన్ని కఠినమైన నియమాలు పాటించడం తప్పనిసరి.

సోషల్ మీడియా నుంచి బంధాన్ని పదిలపరుచుకునే సూత్రాలు
  • భోజనం చేసేటప్పుడు ఫోన్లను పూర్తిగా పక్కన పెట్టండి.
  • బెడ్‌రూమ్‌లోకి మొబైల్స్ తీసుకువెళ్లకపోవడం లేదా ‘నో ఫోన్ జోన్’గా ప్రకటించడం మంచిది.
  • భాగస్వామితో గడిపే సమయాన్ని ‘క్వాలిటీ టైమ్’గా మార్చుకోండి.
  • సోషల్ మీడియా కంటే మీ నిజ జీవిత అనుభూతులకు ప్రాధాన్యత ఇవ్వడం.

సాంకేతికతను పరిమితంగా వాడుతూ, మనుషుల మధ్య ఉండే ప్రేమను, అనురాగాన్ని కాపాడుకున్నప్పుడే ఏ బంధమైనా కలకాలం నిలుస్తుంది. మీ భాగస్వామికి సమయం ఇవ్వడమే మీరు ఇచ్చే అతిపెద్ద బహుమతి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>