కలం, వెబ్ డెస్క్: చైనా (China) రాజధాని బీజింగ్ (Beijing)లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఓ చిన్న విమానం ఎత్తైన భవనాన్ని ఢీకొట్టి ముక్కలు ముక్కలైపోయింది. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే నగరాల్లో ఒకటైన బీజింగ్‌లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చైనా అధికారులను దిగ్భ్రాంతికి గురి చేసింది. చైనా జున్గా పిలిచే ఈ 109 అంతస్తుల భవనంపై నుంచి విమానం శిథిలాలు కింద పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ శిథిలాలు పడి కింద రోడ్డుపై ఉన్న ఒక టాక్సీ అద్దాలు పగిలిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే భవనంలోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. ఈ ఘటనపై చైనా ప్రభుత్వ అధికారిక వర్గాల నుండి ఇంకా ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. స్థానిక పోలీసులు కూడా దీనిపై స్పందించేందుకు నిరాకరించారు. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న విమాన రిజిస్ట్రేషన్ కోడ్ ఆధారంగా అది చైనాలోనే తయారైన సన్వర్డ్ ఎస్ఏ 60ఎల్ అరోరా అనే లైట్ స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ అని తెలుస్తోంది. ఈ చిన్న విమానం పైలట్ శిక్షణ, వినోద ప్రయాణాలు, ఏరియల్ ఫోటోగ్రఫీ సేవలు అందించే ఒక స్థానిక విమానయాన సంస్థకు చెందినట్లు సమాచారం.
బీజింగ్ నగర పరిధిలో మే 1 నుండి డ్రోన్లు, ప్రైవేట్ విమానాలు ఎగరవేయడంపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి విమాన వాహనాలను అనుమతించని ఇలాంటి హై సెక్యూరిటీ ఏరియాలోకి ఈ చిన్న విమానం ఎలా వచ్చిందన్నతి తేలాల్సి ఉంది. ఈ విమానం సుమారు 20 నిమిషాల పాటు ప్రయాణించి భవనాన్ని ఢీకొట్టడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. విమానం చాలా చిన్నది కావడంతో ప్రాణనష్టం పెద్దగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

