పరిహారం, పునరావాసం చెల్లింపులపై సీఎం కీలక నిర్ణయం

కలం, వెబ్ డెస్క్ : పలు ప్రాజెక్టుల కింద పెండింగ్ లో ఉన్న పరిహారం, పునరావాసం చెల్లింపులు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డితో క‌లిసి నీటి పారుద‌ల శాఖ‌పై సీఎం ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీలో బుధ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

నీటి పారుద‌ల‌, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించి ముంపు గ్రామాలు, ప‌రిహారం, పున‌రావాసానికి సంబంధించి వాస్త‌వ నివేదిక రూపొందించాల‌ని ఆదేశించారు. త‌క్ష‌ణ ప్ర‌భావం పడే గ్రామాలకు వెంట‌నే ప‌రిహారం చెల్లించాల‌న్నారు. అధికారులు ఆ ప‌నుల‌ను పూర్తి చేస్తే బ‌స్వాపూర్‌, గౌర‌వెల్లి ప్రాజెక్టుల్లో నీరు నింపే అవ‌కాశం ఉంటుంద‌ని స్పష్టం చేశారు.

గ‌రిష్ట స్థాయిలో గోదావ‌రి జ‌లాల వినియోగం

గోదావరి నదీ జలాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఎల్లంపల్లితో పాటు దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత వరకు ఎత్తిపోతలు చేపట్టాలని సూచించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచ‌న‌ల మేర‌కే సుందిళ్ల‌, అన్నారం, మేడిగ‌డ్డ బ్యారేజీల్లో నీరు నిల్వ చేయ‌డం లేద‌ని రేవంత్ (CM Revanth Reddy) స్పష్టం చేశారు.

మేడిగడ్డతో పాటు సుందిళ్ల బ్యారేజీలో ఉన్న లోపాల విషయంలో ఎన్డీఎస్ఏను సంప్రదించాలని సూచించారు. గ‌ట్టు, గూడెందొడ్డి ఎత్తిపోత‌ల సామ‌ర్థ్యం పెంపున‌కు సంబంధించి స‌మ‌గ్ర అధ్య‌య‌నం చేయాల‌ని ఆదేశించారు. గూడెందొడ్డి పంప్డ్‌స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి క‌న్స‌ల్టెంట్ నియ‌మించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స‌మీక్ష‌లో సీఎం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ వి.శేషాద్రి, సీఎం సెక్ర‌ట‌రీ మాణిక్ రాజ్‌, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ కార్య‌ద‌ర్శి ఈ.శ్రీ‌ధ‌ర్‌, ఆర్ అండ్ ఆర్ క‌మిష‌న‌ర్ శివ కుమార్ నాయుడు త‌దిత‌రులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>