బావు చెరువుకు జలకళ.. రైతన్నలతో వనభోజనంలో గంగుల సందడి

కలం, కరీంనగర్ బ్యూరో : కాళేశ్వరం జలాలతో కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలం బావుపేట శివారు బావు చెరువు నిండి మత్తడి దూకడంతో, మండలంలోని పలు గ్రామాల రైతులు హర్షాతిరేకాల మధ్య వనభోజన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) ముఖ్య అతిథిగా హాజరై రైతన్నలతో కలిసి ఉత్సాహంగా గడిపారు.

​మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు..

వేడుకల ప్రారంభంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బావు చెరువు వద్ద కొలువైన మైసమ్మ తల్లికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెరువులో పసుపు-కుంకుమలు, పూలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రైతన్నలతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.

​కేసీఆర్ వల్లే నియోజకవర్గ అభివృద్ధి: గంగుల

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఈ ప్రాంతం ఒక సాధారణ కుగ్రామంగా ఉండేదని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి, వందల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మండలంలోని గ్రామాలకు సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆచంపల్లి వద్ద వరద కాలువకు తూము ఏర్పాటు చేసి ఏడు గ్రామాలకు సాగు నీరు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

​ప్రస్తుత ప్రభుత్వ పాలనపై విమర్శలు..

కేసీఆర్ హయాంలో పదేళ్ల పాటు తెలంగాణ అన్ని రంగాల్లోనూ స్వర్ణయుగంలా అభివృద్ధి చెందిందని, కానీ ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని గంగుల కమలాకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వంలో ప్రతి వర్గమూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని విమర్శించారు. కేవలం రెండున్నర ఏళ్లలోనే రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలంగాణను మళ్లీ అగ్రపథంలో నడిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

​నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి..

ప్రత్యేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగానే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి చెరువులను నింపుకున్నామని, ప్రస్తుతం ఆ నీటితోనే ప్రాంతం సస్యశ్యామలంగా ఉందన్నారు. అయితే రాబోయే ఏడాది కాలం ఎల్ నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, రైతులు నీటిని చాలా అప్రమత్తంగా, పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కేసీఆర్ పాలనలో రైతులు, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>