కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ (SLBC Tunnel) పనులను వెంటనే పునఃప్రారంభించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సచివాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వెల్లడించారు.
మిగిలి ఉన్న 9.8 కిలోమీటర్ల సొరంగం పనులను పూర్తి చేసేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా అత్యాధునిక టన్నెలింగ్ పద్ధతులతో పాటు, త్రీడీ మానిటరింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ సాంకేతికత ద్వారా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఎలాంటి జాప్యం లేకుండా పనులను ముందుకు తీసుకెళ్తామని అధికారులకు స్పష్టం చేశారు. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆయన యంత్రాంగాన్ని ఆదేశించారు.
ఈ ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సుమారు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. అలాగే వందలాది గ్రామాలకు తాగునీటి సమస్య తీరనుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy ) వివరించారు. ప్రజల చిరకాల స్వప్నమైన ఈ ప్రాజెక్టును కేవలం లక్ష్యంగా పెట్టుకోవడమే కాకుండా, కచ్చితమైన గడువులోగా పూర్తి చేసి రైతులకు అంకితం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనుల్లో ఎక్కడా నాణ్యత తగ్గకుండా చూడాలని, నిధుల కొరత లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.


