కలం, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని వదిలేందుకు సిద్ధంగా లేనట్టే తెలుస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడుకు కుప్పం ఎలానో.. మాజీ సీఎం జగన్ కు పులివెందుల ఎలానో.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూడా తనకు పిఠాపురంను అలాగే మార్చుకుంటున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా డిప్యూటీ సీఎం అయిపోయారు. తనకు కలిసొచ్చిన నియోజకవర్గంగా ఆయన భావిస్తున్నారంట. అందుకే పిఠాపురం అభివృద్ధికి పవన్ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్టు జనసైనికులు చెబుతున్నారు.
మహిళలకు చీరెలు, సారెలు నుంచి.. ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ పనులను చేయిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు పిఠాపురం అభివృద్ధి కోసం రూ.200 కోట్ల ప్రత్యేక నిధులను కేటాయించి పనులు ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. ప్రతి ఊరితో తనకు బంధం ఉండేలా చూసుకుంటున్నారు. పిఠాపురంలో టీడీపీ నుంచి ఎస్వీఎస్ ఎన్ వర్మ తన సొంత కార్యకలాపాలు సాగిస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కోసం ఆయన టికెట్ త్యాగం చేశారు. అయినప్పటికీ ఆయన ప్రభావం బలంగానే ఉందనే చర్చ స్థానికంగా జరుగుతోంది.
కాబట్టి పవన్ కల్యాణ్ తనకు ప్రతి ఊరిలో పట్టు పెంచుకునేలా.. పార్టీ బలోపేతానికి స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. పవన్ కల్యాణ్ అంటే పిఠాపురం అనేలా ఇక్కడ ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నారు. ఇంకో 15 ఏళ్లు కూటమి పొత్తు అంటున్నారు పవన్. ఆ లెక్కన పిఠాపురం టికెట్ పవన్ కల్యాణ్ తనకే దక్కేలా ఇక్కడ బలంగా పాతుకుపోయేలా పావులు కదుపుతున్నారు. ఇంకో 30 ఏళ్ల దాకా పిఠాపురం నుంచే రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారంట. అందుకే మన ముద్ర బలంగా పడేలా పవన్ కల్యాణ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పట్లో ఆయన్ను పిఠాపురం నుంచి కదిలించడం కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


