కలం, వెబ్ డెస్క్: నక్షత్ర నిశీధి మొత్తం రిస్క్(Sky at Risk)లో పడిందా? రాను రాను నక్షత్రాలను చూసే భాగ్యం కూడా మనుషులకు ఉండదా? ఆస్ట్రోనామర్స్ ఈ రకమైన సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నక్షత్రాల స్థానాన్ని శాటిలైట్లు భర్తీ చేసే ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మనం ఇప్పుడు చూస్తున్న అందమైన నక్షత్ర కాంతుల ఆకాశం.. భవిష్యత్తులో కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. టెక్నాలజీ అభివృద్ధి పేరుతో ప్రపంచ దేశాలు, పలు ప్రముఖ సంస్థలు చేపడుతున్న అంతరిక్ష ప్రాజెక్టులే ఇందుకు కారణం కావొచ్చని వారు వివరిస్తున్నారు. ముఖ్యంగా స్పేస్ ఎక్స్ (SpaceX) వంటి సంస్థలు లక్షలాది ఏఐ డేటా ప్రాసెసింగ్ శాటిలైట్లను పంపాలని ఆలోచిస్తున్న సమయంలో శాస్త్రవేత్తలు చేసిన ఆ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
అద్దాల వెలుగుతో ఆకాశానికి ముప్పు
రిఫ్లెక్ట్ ఆర్బిటల్ (Reflect Orbital) అనే సంస్థ అంతరిక్షంలో భారీ అద్దాలను అమర్చాలని ప్లాన్ చేస్తోంది. ఈ అద్దాలు సూర్యకాంతిని ప్రతిబింబించి రాత్రి వేళ భూమిపై వెలుగును ఇస్తాయి. దీనివల్ల పగటి సమయం పెరిగి విద్యుత్ అవసరాలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే, రాయల్ ఆస్ట్రానమికల్ సొసైటీకి చెందిన రాబర్ట్ మాస్సే దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవి చంద్రుడి కంటే ఎక్కువ వెలుగును చిమ్ముతాయని, దీనివల్ల టెలిస్కోపుల ద్వారా సుదూర అంతరిక్ష వస్తువులను అధ్యయనం చేయడం అసాధ్యమవుతుందని ఆయన హెచ్చరించారు.
చిక్కుల్లో పడనున్న అంతరిక్షం
మరోవైపు, స్పేస్ ఎక్స్ (Spacex) ఏకంగా పది లక్షల డేటా సెంటర్ శాటిలైట్లను లాంచ్ చేయాలని భావిస్తోంది. ఇవి ఆకాశంలో కదిలే వెలుగు చుక్కల్లా కనిపిస్తూ ఖగోళ పరిశీలనలకు అడ్డుపడతాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల దాదాపు 10 శాతానికి పైగా చిత్రాల డేటాను కోల్పోయే ప్రమాదం ఉందని యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీకి చెందిన ఒలివర్ హైనాట్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న శాటిలైట్ల కంటే ఇవి అర్ధరాత్రి కూడా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఆకాశాన్ని కలుషితం (Sky at Risk) చేస్తాయని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.
ప్రమాదంలో జీవన చక్రం
ఆకాశం కేవలం విజ్ఞాన శాస్త్రమే కాదని, వేల ఏళ్లుగా మానవ జీవితంతో ముడిపడి ఉన్న వారసత్వమని ఆస్ట్రోఫిజిసిస్ట్ నోలియా నోయెల్ పేర్కొన్నారు. ఈ కాంతి కాలుష్యం వల్ల జంతువుల జీవన చక్రం దెబ్బతినడమే కాకుండా, మనుషుల నిద్రపై కూడా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలను సరిగ్గా పాటించకుండానే ఇలాంటి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడంపై శాస్త్రవేత్తలు అభ్యంతరం చెబుతున్నారు. అంతరిక్ష సాంకేతికత పెరగడం అవసరమే అయినా, రాబోయే తరాలకు నక్షత్రాల ఆకాశాన్ని అందించాలంటే కఠినమైన అంతర్జాతీయ నిబంధనలు ఉండాలని వారు కోరుతున్నారు.
Read Also: సీఎంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
Follow Us On: Youtube

