కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచల (Bhadrachalam) పుణ్యక్షేత్రంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి ఇప్పటికే ఎంతో మంది భక్తులు గోటి తలంబ్రాలు సమర్పించారు. కాగా హైద్రాబాద్ లోని చందానగర్ కు చెందిన చలువాది మల్లు విష్ణు వందన (Mallu Vishnu Vandana) అనే భక్తురాలు బియ్యపు గింజలపై శ్రీరామ నామం (Sri Rama Namam) రాసి భద్రాచల ఆలయంలో స్వామివారి పాదాల చెంత సమర్పించారు. లక్షా డెబ్బై ఐదు వేల బియ్యపు గింజలపై వివిధ రకాల రంగులతో శ్రీరామ అని రాసి, ఆలయ ఈ.ఓ దామోదర్ రావు కు అందజేశారు. దాదాపు రెండున్నర కిలోల బియ్యపు గింజలపై ఓపికతో శ్రీ రామ అని రాసి అందరితో ప్రశంసలు అందుకుంటున్నారు. బియ్యపు గింజలపై రామ నామాన్ని లిఖించే కార్యక్రమాన్ని ఆమె 2016 నుంచి నిరంతరాయంగా చేస్తుండటం గమనార్హం. ఇలా శ్రీరామ నామం కలిగిన బియ్యపు గింజలను కళ్యాణం రోజు అక్షింతల్లో కలిపి వివాహ వేడుక జరిపిస్తామని ఆలయ అర్చకులు చెప్తున్నారు.
దశాబ్దకాలంగా 12 లక్షల బియ్యపు గింజలపై శ్రీరామ నామన్ని (Sri Rama Namam) లిఖించానని, భద్రాచల రాములవారికే కాకుండా దేశంలోని 132 ఆలయాలకు శ్రీరామ నామం ఉన్న బియ్యపు గింజలు పంపిణీ చేశానని వందన వెల్లడించారు. ప్రతి రోజు ఒక దినచర్య లాగా కొంత సమయాన్ని బియ్యపు గింజలపై శ్రీరామ నామం లిఖించడానికి కేటాయిస్తానని చెప్తున్నారు. రోజుకు 1000 గింజలపై రామ నామాన్ని రాస్తానని తెలిపారు. 2016లో మొట్టమొదటి సారిగా ప్రారంభమైన తలంబ్రాల సేవ తొలుత ఒంటిమిట్ట తర్వాత భద్రాద్రి, ఆ తర్వాత హైద్రాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 320 కళ్యాణోత్సవాల్లో తలంబ్రాలను స్వామి వారికి సమర్పించారని తెలియజేశారు. పదేళ్ల నుంచి 12 లక్షల బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని లిఖిస్తూ ఉండడమంటే సాధారణ విషయం కాదని, ఎంతో నిబద్ధత అచంచల భక్తి, విశ్వాసం ఉన్న వారికే ఇది సాధ్యపడుతుందని పలువురు ఈ భక్తురాలిని అభినందిస్తున్నారు.
Read Also: సీఎంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
Follow Us On: X(Twitter)

