కలం, సినిమా : సినీ నటుడు విజయ్ రాజకీయాల్లో అరంగేట్రం చేసిన తొలిసారే విజయం సాధించి తమిళనాడు సీఎం పీఠాన్ని అధిరోహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురి హీరోల ఫ్యాన్స్ మీట్స్ ప్రస్తుతం తీవ్ర రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పటికే ధనుష్, అల్లు అర్జున్ వంటి నేతలు ఇటీవల ఫ్యాన్స్ మీట్ నిర్వహించగా.. తాజాగా శివకార్తికేయన్ (Sivakarthikeyan) కూడా ఫ్యాన్స్ మీట్ నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. శివకార్తికేయన్ చెన్నైలో నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ కు దాదాపు 2వేల మందికి పైగా హాజరయ్యారు. ఈ మీటింగ్ కు ఫ్యాన్స్ ఒకే తరహా తెల్ల చొక్కాలు, బ్యానర్లు, జెండాలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా శివకార్తికేయన్ మాట్లాడుతూ.. తనను ‘సెల్ఫ్‌మేడ్ స్టార్’ అని పిలవడం కంటే ‘పీపుల్స్ మేడ్ స్టార్’ అని పిలిస్తే ఇష్టం అని తెలిపారు. తన అభిమానులు బాగా చదువుకోవాలని, సంపాదించాలని, అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.
అయితే ఈ సమావేశంలో శివకార్తికేయన్‌ను ఉద్ధేశించి ఫ్యాన్స్ సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో శివకార్తికేయన్ కూడా విజయ్ తరహాలో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. విజయ్ తరహాలో ఫ్యాన్స్ తో నిరంతరం టచ్ లో ఉంటూ తదుపరి రాజకీయాల్లోకి రావాలని శివకార్తికేయన్ భావిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ తన రాజకీయ ఎంట్రీపై శివకార్తికేయన్ ప్రస్తుతానికైతే ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

