కలం, నిర్మల్: సారంగాపూర్ మండలం బోరిగాం (Boregaon) గ్రామ రైతులు సాగునీటి కోసం సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. స్వర్ణ జలాశయం(Swarna Reservoir) నుంచి నీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. దీంతో కలెక్టరేట్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామ చెరువు కింద సుమారు 700 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో చెరువులో నీరు లేక పంటలకు సాగునీటి కొరత ఏర్పడిందని అన్నారు. ముఖ్యంగా వరి పంట పొట్ట దశకు చేరుకోవడంతో నీరు అత్యవసరంగా అవసరమని పేర్కొన్నారు.
స్వర్ణ జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తే చెరువును నింపి పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుందని రైతులు తెలిపారు. తమ సమస్యను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లాలని.. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అధికారులు అనుమతించలేదు. దీంతో రైతులు కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడం లేదని, పంటలను కాపాడుకునేందుకు స్వర్ణ జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

