ఖమ్మంకు గోదావరి జలాలు.. తాగునీటి కష్టాలకు చెక్

కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఖమ్మం (Khammam) జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. భద్రాచలం వద్ద ఉన్న సీతారామ ఎత్తిపోతల పథకం (Sita Rama Lift Irrigation Project) ద్వారా గోదావరి జలాలను (Godavari Water) ఖమ్మం జిల్లా తాగునీటి అవసరాల కోసం మళ్లిస్తున్నారు. గత రెండు రోజులుగా గోదావరి నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతుండగా, శుక్రవారం సాయంత్రం ఏన్కూర్ నాగార్జునసాగర్ ఎడమ కాలువ రెడ్డిగూడెం ప్రాంతంలో గోదావరి నీటి ప్రవాహాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ జిల్లాలోని ఏ ఒక్క గ్రామంలోనూ తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

సీతారామ ప్రాజెక్టు నుంచి సుమారు 1,500 క్యూసెక్కుల గోదావరి జలాలను ఏన్కూర్ రెగ్యులేటర్‌కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా నీటి పంపిణీ జరుగుతోంది. ఇందులో భాగంగా ఏన్కూర్ రెగ్యులేటర్ నుంచి ఎన్ఎస్‌పీ కాలువ ద్వారా దిగువ ప్రాంతాలకు 1,000 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ఈ నీరు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంకాసాగర్ ప్రాజెక్టు వరకు చేరుకోనుంది. అలాగే రెగ్యులేటర్ నుంచి కాలువ ఎగువ ప్రాంతాలకు 500 క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నారు. ఇందులో 250 క్యూసెక్కుల నీటిని వైరా రిజర్వాయర్‌కు, మరో 250 క్యూసెక్కులను స్థానిక చెరువులకు విడుదల చేస్తున్నారు.

గోదావరి జలాలు చేరడంతో జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకుంటున్నాయి. ఈ నీటి సరఫరాతో ఖమ్మం జిల్లా ప్రజల తాగునీటి అవసరాలు తీరడంతో పాటు భవిష్యత్‌లో నీటి కొరతకు పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>