కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని(International Literacy Day) పురస్కరించుకొని మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలో మంగళవారం అక్షరాస్యత అవగాహన ర్యాలీని ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా(Collector Khushboo Gupta) జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ మల్లికార్జున్ ఎంటర్‌ప్రైజెస్ మీదుగా కొనసాగి అంబేద్కర్ చౌరస్తా వద్ద ముగిసింది. ర్యాలీలో పాఠశాల విద్యార్థులు, మహిళలు, ఉపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ.. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా అక్షరాస్యతను విస్తృతంగా పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అక్షరాస్యత అంటే కేవలం చదవడం, రాయడం నేర్చుకోవడం మాత్రమే కాదని, వ్యక్తి సాధికారతకు, కుటుంబ అభివృద్ధికి, సమాజ పురోగతికి అది పునాది అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విద్యను అందిపుచ్చుకొని తమ హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాలని సూచించారు. “అక్షరం ప్రతి ఒక్కరి హక్కు.. విద్య ప్రతి కుటుంబానికి బలం. నిరక్షరాస్యతను నిర్మూలించి ప్రతి వ్యక్తిని అక్షరాస్యుడిగా తీర్చిదిద్దడం మనందరి సామాజిక బాధ్యత” అని కలెక్టర్ అన్నారు. అక్షరాస్యత పెరిగితే ప్రజల్లో అవగాహన, ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడి సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల్లో అక్షరాస్యత ప్రాధాన్యతపై అవగాహన కల్పించడం, నిరక్షరాస్యులను విద్య వైపు ప్రోత్సహించడం, “ప్రతి ఒక్కరూ చదవాలి – ప్రతి ఒక్కరూ ఎదగాలి” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ర్యాలీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. వయోజన విద్యాశాఖ, మహబూబ్‌నగర్ ఆధ్వర్యంలో ఎన్‌ఐఎల్‌పీ–ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ఈ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, డీఈఓ విజయకుమారి, డీఆర్డీఓ నర్సింహులు, వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

