ప్రభుత్వ వాహనాలకు ఒక నిబంధన.. ప్రైవేట్‌ వాహనాలకు మరోటా?

కలం,‌ జోగులాంబ గద్వాల: రోడ్డు నిబంధనల పేరుతో రవాణా శాఖ (Transport Department) అధికారులు సామాన్యుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ, భారీ జరిమానాలతో చెలగాటమాడుతున్నారని జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా డ్రైవర్ల అసోసియేషన్ (Drivers Association) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వాహనానికి ఎల్ఈడీ (LED) లైట్ అమర్చుకున్నారనే నెపంతో ఏకంగా రూ.5,000 జరిమానా విధించడంపై డ్రైవర్లు, వాహనదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రవాణా శాఖ అధికారిక ప్రాసిక్యూషన్ జాబితా ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో మార్పులు చేయడం లేదా రోడ్డు భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలపై వేర్వేరు సెక్షన్లు, నిబంధనలు ఉన్నప్పటికీ ప్రతీ సందర్భంలోనూ ఎల్ఈడీ లైట్లకు ఒకే రీతిగా రూ.5,000 వసూలు చేయడం వెనుక గల చట్టబద్ధతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

​ప్రభుత్వ వాహనాలకు ఒక న్యాయం.. సామాన్యుడికి మరొకటా?

అధికారులు, డిపార్ట్‌మెంట్ వాహనాల్లో ఎల్ఈడీ లైట్లను నిరభ్యంతరంగా ఉపయోగిస్తున్నప్పుడు, అదే లైట్లు వేసుకున్న ప్రైవేటు వాహనాలపై మాత్రం తక్షణమే చలానాలు విధిస్తుండటంపై డ్రైవర్ల సంఘాలు నిలదీస్తున్నాయి. అత్యవసర సేవలు, ప్రభుత్వ వాహనాలకు ప్రత్యేక నిబంధనలు ఉన్నప్పటికీ, కేవలం సామాన్యులనే లక్ష్యంగా చేసుకుని భారీ చలానాలు విధించడం ఏమాత్రం సమంజసం కాదని వారు మండిపడుతున్నారు.

​చెల్లుబాటు అయ్యే సెక్షన్లపై స్పష్టత ఏది?

వాహనం (కారు, బొలెరో, ట్రావెలర్) ఏ రకమైనది? ఎల్ఈడీ లైటును ఎక్కడ అమర్చారు (ముందు భాగం, పైకప్పు లేదా లోపల)? అది ఫ్లాషింగ్ బీకన్ లైటా లేక అదనపు వెలుగు కోసం వేసుకున్న సాధారణ లైటా? అనే విషయాలను సరిగ్గా పరిశీలించకుండానే రూ. 5,000 జరిమానాలు వేస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు వర్తించే చట్టబద్ధమైన సెక్షన్లు, ఆఫెన్స్ కోడ్‌లను పారదర్శకంగా వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.

​అధికారులు స్పందించాలి: డ్రైవర్ల అసోసియేషన్ డిమాండ్

జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal)రవాణా కార్యాలయంలో అధికారికంగా నమోదైన మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (MVI) R.రాధిక, ఉన్నతాధికారులు ఈ జరిమానాల విధింపుపై తక్షణమే స్పష్టత ఇవ్వాలని డ్రైవర్ల అసోసియేషన్ కోరుతోంది. రూల్స్ పేరుతో పేద, మధ్యతరగతి డ్రైవర్ల జీవితాలతో, ఉపాధితో చెలగాటం ఆడవద్దని, నిబంధనల ప్రకారం చలాన్ల కాపీల్లో సరైన సెక్షన్లు పొందుపరచడంతో పాటు అప్పీల్ చేసుకునేందుకు అవకాశాలు కల్పించాలని గద్వాల జిల్లా డ్రైవర్ల సంఘం డిమాండ్ చేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>