కలం, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు రహదారి భద్రతను బలోపేతం చేయడానికి ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రవాణా వ్యవస్థపై సమగ్ర అధ్యయనం ఆధారంగా ఈ బ్యూరోకు పటిష్టమైన సంస్థాగత వ్యవస్థను రూపొందించాలని సూచించారు. బోధి పావిలియన్, ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ట్రాఫిక్ నిర్వహణ చర్యలపై ప్రతి రెండు నుంచి మూడు నెలలకు ఒకసారి సమీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ట్రాఫిక్ నిబంధనల అమలుకే పరిమితం కాకుండా ట్రాఫిక్ నిర్వహణ, క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం స్పష్టం చేశారు. వాతావరణ పరిస్థితులు, ఆఫీసుల పని వేళలు, రద్దీ సమయాలు, స్థానిక ప్రయాణ విధానాలను పరిగణనలోకి తీసుకుని ట్రాఫిక్ ప్రణాళికలు రూపొందించాలన్నారు. అలాగే కొత్త మౌలిక సదుపాయాల నిర్మాణానికి ముందు సమగ్ర ట్రాఫిక్ అధ్యయనాలు చేపట్టాలని, హైదరాబాద్‌లో స్మార్ట్ సిగ్నలింగ్ వ్యవస్థపై సమగ్ర పరిశీలన నిర్వహించాలని ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదాల నివారణ చర్యలను మరింత బలోపేతం చేయడంతో పాటు వాహనాలు ఎక్కడపడితే అక్కడ నిలిపివేయకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేలా సాధ్యమైన చోట్ల అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించి సిగ్నల్-రహిత కారిడార్లను అభివృద్ధి చేయాలని సూచించారు.

