కలం, తెలంగాణ బ్యూరో : కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో పొలిటికల్ ఈక్వేషన్స్ వేగంగా మారుతున్నాయి. బండి భగీరథ్ పోక్సో కేసు టైమ్ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)ను కేటీఆర్ టార్గెట్ చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని బండి సంజయ్‌ను టార్గెట్ చేసి మంత్రి పదవి నుంచి తప్పుకుంటారా?.. లేక ప్రధాని జోక్యం చేసుకుని తప్పిస్తారా?.. అంటూ కేటీఆర్ (KTR) ఘాటు కామెంట్లే చేశారు. దానికి కౌంటర్‌గా బండి సంజయ్ సైతం “కేటీఆర్ ఒక ఫేక్ మీడియా ఫ్యాక్టరీని నడిపిస్తున్నారు. నా కొడుకును రాజకీయాల్లోకి లాగి కుట్రలు చేస్తున్నారు. నన్ను ఇరుకున పెట్టేవారిని వదిలిపెట్టను. నా కుటుంబాన్ని టార్గెట్ చేసిన వారిని రాజకీయంగా బొంద పెడతాను” అని అప్పట్లోనే కౌంటర్ ఇచ్చారు. అయితే.. ఇప్పుడు ఏకంగా కేటీఆర్ కోటలో బండి సంజయ్ అడుగుపెట్టారు. కేటీఆర్ తన సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని వేములవాడలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తుండగానే బండి సంజయ్ ఆ సెగ్మెంట్‌లో పర్యటించడం విశేషం.
వ్యక్తిగత, రాజకీయ పలుకుబడికే పరీక్ష..
సిరిసిల్ల అనగానే కేటీఆర్ రాజకీయ ప్రస్థానమే గుర్తుకొస్తుంది. ఆయనకు ఇది కేవలం ఒక అసెంబ్లీ స్థానమే కాదు.. వ్యక్తిగత రాజకీయ బలానికి కూడా ప్రతీక అని బీఆర్ఎస్ లీడర్లు గొప్పగా చెప్పుకుంటుంటారు. బీఆర్ఎస్ పాలనలో ఈ నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ పాఠశాల నిర్మాణం, స్పెషల్ డెవలప్ ఫండ్ పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చయింది. ఇక్కడ ఓడిపోతే కేటీఆర్ పొలిటికల్ ఫ్యూచర్ ప్రశ్నార్థకమవుతుంది. ఆ పరిస్థితి తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే ఈ నెల ఫస్ట్ వీక్‌లో ‘గిఫ్ట్ ఎ స్మైల్’ కార్యక్రమంలో పాల్గొని టెన్త్ క్లాస్ మెరిట్ స్టూడెంట్స్‌కు టాబ్‌లు కేటీఆర్ పంపిణీ చేశారు. అంతకుముందు రైతుల సమస్యలపై ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాజాగా సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల జనరల్ బాడీ సమావేశాలకు హాజరై పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత బలోపేతం, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. నెల రోజుల వ్యవధిలోనే నాలుగైదుసార్లు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.
ఈసారి ముక్కోణపు పోటీ!
ఇంతకాలం సిరిసిల్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ. కానీ బండి భగీరథ్ పోక్సో వ్యవహారం నుంచి ఈ స్థానంపై బండి సంజయ్ ఫోకస్ పెట్టారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్‌లోనే సిరిసిల్ల అసెంబ్లీ ఉంటుంది. బండి సంజయ్ (Bandi Sanjay) సిరిసిల్లలో శనివారం ‘స్వచ్ఛ పాఠశాల’ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ఇది ఒక పర్యటన మాత్రమే కాదని, అక్కడ బీజేపీ రాజకీయ విస్తరణకు చేస్తున్న ప్రయత్నాలకు సంకేతమనే మాటలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ సిరిసిల్లపై ఫోకస్ పెంచడం యాధృచ్ఛికం కాదని, పొలిటికల్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకునే ప్రయత్నాల్లో భాగమన్నది స్థానిక నేతల్లో జరుగుతున్న చర్చ. ముక్కోణపు పోటీలో స్వల్ప మార్జిన్‌తో గెలుపోటములు డిసైడ్ కానున్నాయి. బీఆర్ఎస్ ఓటు బ్యాంకును ఏ మేరకు చీల్చగలిగితే అది రాజకీయంగా అంత పెద్ద విజయంగా ఉంటుంది.

