కలం, తెలంగాణ బ్యూరో : మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగిన మీనాక్షి నటరాజన్ విషయంలో తెలంగాణలోని ఓ కేసు గురించి బీజేపీ నేతలకు ఉప్పందించిన లీకు వీరులను గుర్తించే పని మొదలైందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నామని చెప్పారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. “మీనాక్షి నటరాజన్ నామినేషన్ వ్యవహారంలో బీజేపీ నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఆమె నామినేషన్‌ను తిరస్కరించి రాజకీయంగా బలి చేశారు. కాంగ్రెస్‌లోని లీకు వీరులపై పార్టీ నాయకత్వం, సీఎం రేవంత్ ఇప్పటికే సమగ్రంగా విచారిస్తున్నారు” అని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో విభేదాలు ఉండడం సహజమేనని, కానీ అంతమాత్రన కుట్రకు పాల్పడడం దుర్మార్గమన్నారు. పార్టీ అంతర్గత వివరాలను బయటకు చేరవేస్తున్నవారిని గుర్తించి చర్యలు తీసుకోక తప్పదని స్పష్టం చేశారు. తప్పుడు వివరాలు చేరవేసినవారిపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పసలేని కేసును పట్టుకుని..!
‘ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కిన బీజేపీ తిరిగి మాపైనే బురద జల్లుతున్నది. మీనాక్షి విషయంలో బీజేపీ తీరు చూసిన తర్వాత ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక నియంత దేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతున్నది’ అని మహేశ్ గౌడ్ అన్నారు. మీనాక్షిపై తెలంగాణలో పోలీసు కేసే లేదని, ఫిర్యాదుకు స్పందనగా ఆమెకు నోటీసు మాత్రమే వచ్చిందని పీసీసీ చీఫ్ తెలిపారు. ఎఫ్ఐఆర్ అనేదే లేనప్పుడు ఇక కేసు ఎక్కడిదని ప్రశ్నించారు. ‘‘ఆమెపై కేసు లేదు.. క్రైమ్ నంబర్ లేదు.. ప్రైవేట్ కేసు ఆధారంగా నామినేషన్ తిరస్కరించడం హేయమైన చర్య” అని ఆయన పేర్కొన్నారు. పసలేని కేసును పట్టుకుని దుర్బుద్ధితో ఆర్వో ఆమె నామినేషన్‌ను తిరస్కరించారని మహేశ్ గౌడ్ మండిపడ్డారు. ఆర్వోకు ఆ అధికారం లేకున్నా ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఒత్తిడితో ఆ నిర్ణయం తీసుకున్నారని, ఇందుకు ఆర్వోను ఉరి వేసినా తప్పులేదన్నారు. రాజ్యసభలో బలం పెంచుకోవాలనే కుట్రతోనే బీజేపీ దీనికి పూనుకున్నదని, ఇందులో బీజేపీ ఫాసిస్టు విధానం కనిపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అప్పుడు ఓట్ చోరీ..ఇప్పుడు సీటే చోరీ
‘ఇప్పుడు బీజేపీ వ్యవహరించిన తీరునే యూపీఏ హయాంలో కాంగ్రెస్ వ్యవహరించి ఉంటే మోదీ ప్రధాని అయ్యేవారా?.. గుజరాత్‌కు ముఖ్యమంత్రి అయ్యేవారా?..’ అని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. గతంలో మహరాష్ట్రలో బీజేపీ ఏం చేసిందో.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో ఏం చేస్తున్నదో ప్రజలు చూస్తున్నారని ఆయన అన్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని కార్యాలయం ఇన్వాల్వ్ అయ్యిందని ఆరోపించారు. ఆమె నామినేషన్ తిరస్కరణ దేశ రాజకీయాల్లోనే ఒక కళంకం అని, మోదీ చర్యలు పరాకాష్టకు చేరుకున్నాయన్నారు. గడిచిన పన్నెండేండ్లలో మోదీ చేసిందేమీ లేదని మహేశ్ గౌడ్ దుయ్యబట్టారు. అరాచకం చేస్తామంటూ బీజేపీ ఎంపీ అరవింద్ నిస్సిగ్గుగా ఒప్పుకుంటున్నారని, ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు ఓడిపోతారని ఆయన అన్నారు. బీఆర్ఎస్‌పై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పందిస్తూ.. ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటామని అనడం మూర్ఖత్వమని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కల్ల అన్నారు. కేటీఆర్, కేసీఆర్ పాదయాత్ర, బస్సుయాత్రలపై ఆయన మాట్లాడుతూ.. పదేండ్లు బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం, భూ దోపిడీ, అప్పుపై వివరణ ఇచ్చి యాత్రలు చేయాలని ఎద్దేవా చేశారు.

